Friday, July 10, 2015

ఒక్క అడుగు 



-" హలో .. ! అరేయ్ నైతిక్ ఇవ్వాళైనా కలవడానికి కుదురుతుందా భే  ?? "

-" ఆకాశ్  నువ్వా ఇండియా వచ్చావ్ అని తెలుసులే రా.. అయినా ఇప్పుడా నువ్వు నాకు ఫోన్ చేసేది ??గడీ గడీ కి మిస్డ్ కాల్స్ ఇస్తే గుర్తు పట్టలేననుకున్నావా భే ?? నిన్నూ నీ పిచ్చి లెక్ఖల్ని భరించలేంరా బాబు. ఇప్పుడు టైం  చూసుకున్నావా ఎంతైందో ? "

-" టైం దేముంది బావా మన మధ్యలో ? ఆటపట్టిస్తున్న  నవ్వు అటువైపు నుంచి. - " నువ్వు ఆరేళ్ళుగా ఏం పీకుతున్నావో తెలుసు ఎట్లైనా నువ్వు పడుకునేది ఏ పొద్దుటిపూటో కదా .. నువ్వూ నీ సివిల్స్ కోచింగూ సరిపోయింది తీయ్ ".

-" సరే సరే కలుద్దాం గాని నన్నుఒక నాలుగు గంటలైనా పడుకోనియ్యరా నీకు పుణ్యముంటుంది. సాయంత్రం కలుస్తా కదా మాట్లాడుకుందాం. సతీష్ గాణ్ణి , బోస్ గాణ్ణి  కూడా రమ్మని నువ్వే ఫోన్ చెయ్ "

- " సరే మంచిది వాళ్ళను కూడా రమ్మంటాను ఇక నువ్వు పడుకో మరి  .. బై .. బై ... " అంటూనే ఏదో గుర్తోచ్చినోడిలా -" హలో .. హలో .. హలో నైతిక్  " అని మళ్ళీ పలకరించాడు .

-" ఏంట్రా తొందరగా చెప్పు నిద్దరొస్తుంది "

-" 'సీమ' గురించి ఏం చెప్పలేదు ?"

-" రేయ్ దొరికావ్ అంటే నువ్వైపోయినట్టే రా నా చేతుల్లో. నా  మానాన , నా పని నేను చేసుకొని పోతుంటే నీ కతలేంటిరా ... సాయంత్రం కలుద్దాం అన్నా కదా .. సాయంత్రం మాట్లాడుకుందాం. మర్యాదగా ఫోన్ పెట్టేయ్ .. అయినా నువ్వు పెట్టేసేదేంటి నేనే కట్ చేస్తున్నా బై ...!! "  ఫోన్ కట్ చేసి సైలెంట్ మోడ్ లో పెట్టి నిద్రలోకి జారుకున్నాడు నైతిక్. అప్పుడే కోడికి సూర్యోదయమవుతున్న సంగతి తెలిసినట్టుంది. క్కో.. క్కో .. రోక్కో..   అని కూతేయడం కూడా కానిచ్చింది.

                                                               *   *   *   *  *  *  *

కిటికీలోంచి చల్లని గాలి లోనికి వీస్తుంటే, కరెంటు లేక ఫ్యాను తిరగకపోయినా ఒళ్ళంతా చల్లగాలి స్పర్శకు ఆహ్లాదంగా మురుస్తుంటే కళ్ళకు నిదుర గొళ్ళాలను వేద్దామనుకున్నా కుదరలేదు ఆకాశ్ కి. తన గదిలోంచి బయటికొచ్చి బాల్కనీలో చల్లగాలిని ఆస్వాదిస్తూ , పచార్లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. మధ్య మధ్యలో రెండు చేతులను రుద్దుతూ  ముడుచుకుంటున్నాడు . జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి సమయం చూస్తున్నాడు.

చీపుళ్ళ శబ్దాలు, కళ్ళాపి సంగీతం  వినిపిస్తున్నాయి. తూరుపు తెరను తీసి బద్దకంగా రానా వద్దా అనుకుంటూ సూర్యుడు.  మబ్బులు పక్కకు జరపకుండా కాసేపు, జరిపినా మళ్ళీ దాక్కుంటూ కాసేపు బయటికొస్తున్నాడు. ఎప్పటిలాగే పక్షులు కిచకిచలతో  దేవునికి సుప్రభాతం పాడుతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు అనుకున్నాడో ఏమో? వెళ్లి షార్ట్ మార్చుకొని ప్యాంట్ వేసుకొని వేహికల్పై తానెప్పుడు ఇష్టంగా కాఫీ తాగే హోటల్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు. అచ్చంగా జూలై మాసం. దారిపొడవునా మొలుస్తున్న పచ్చగడ్డి. రాత్రి పడ్డ వర్షం వల్ల తోవపోదవునా గడ్డి వాసన. మొత్తానికి వదిలించుకోలేని కొన్ని జ్ఞాపకాలను తలపోసుకుంటూ హోటల్ చేరుకున్నాడు ఆకాశ్.

-"నమస్తే అన్నా ఏందీ చానా రోజుల తర్వాత. సూస్త సూస్త రెండేళ్ళయినట్టుంది కదా యీడికి రాక "

-" అవును యాది అమెరికా వెళ్లాగా ప్రాజెక్ట్ పని మీద. ఇప్పటికి కుదిరుంది. రెండు రోజులైంది వచ్చి. సుస్తీ తీరగానే నీ కాఫీనే గుర్తొచ్చింది వచ్చేశా "

-"గట్లనా పట్టు గరం...  గరం .. కాఫీ స్పెషల్ గా నీకోసం "

ఉదయం ఆరవుతుంది. అంట పొద్దున్న భవిష్యత్తుని వెతుక్కుంటూ పుస్తకాలు పట్టుకొని ట్యూషన్లు , కోచింగులకు పోతున్న పిల్లలు. కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తున్న ఆకాశ్ కి ఆ అమ్మాయి ఇంకా కనబడ్డమే లేదు.

-" యాది ఏమైంది?? ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి ఆ ఇంట్లో పిల్ల బయటికి రాలేదు ఇంకా.. ఈ టైం  కల్లా వచ్చేసేదిగా? " అని రెండేళ్ళ ముందు తను అమెరికా వెళ్ళక ముందు జరిగిన విషయాల కొనసాగింపు కోసం ఆధారం వెతుకుతున్నట్టు అడిగాడు ఆకాశ్.

ఆకాశ్ , సతీష్ కలిసి ఆ రోజు మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి ఆకాశ్ కి.

-" అవున్రా ఆకాశ్ ఈ రోజుల్లో కూడా ఎవరుంటార్రా ఇలా ? ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిముందు కడిగి కళ్ళాపి  చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు??  అని వెటకారంగా అన్నాడు సతీష్.

కాని ఆకాశ్ తన స్నేహితుడు చూడలేని ఇంకొన్ని వింతలూ చూస్తున్నాడు. ముగ్గు పెట్టేప్పుడు కదిలే చేతివేళ్లు. చేతులు కడులుతున్నంత సేపు వినిపిస్తున్న గాజుల శబ్ధం. చుక్కలు ముగ్గుగా కలపడానికి పాదాలు అటూ ఇటూ కదులుతున్నప్పుడు వచ్చే పట్టీల శబ్ధం. ఈ ముగ్గు కోసమే మీ వీధి కొస్తున్నానంటూ మొదటి కిరణంతో ముగ్గును, ముగ్గు వేస్తున్న అమ్మడు చేతుల్ని ముద్దు పెట్టుకునే సూర్యుడు. తనకి మాత్రం ఓ భావకవిత్వం ఆవిష్కరించ బడ్డట్టు అనిపించింది ఆకాశ్ కి.

ముగ్గేయడం అయిపోగానే వెళ్తూ వెళ్తూ తను ఒక్కసారైనా ఆకాశ్ ని ఓరకంట చూసి వెళ్ళేది. అది ఆకాశ్ గమనించినా , గమనించనట్టే ఉండేవాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే కళ్ళముందు ఆ అమ్మాయి అలా ముగ్గేసి లోనికి వెళ్తున్నట్టే అనిపించింది ఆ క్షణం ఆకాశ్ కి. కాని అది ఊహే యాది వచ్చి "అన్నా " అని పిలిచే వరకు.

-" ఎదురింటి సునీత మేడం గురించేనా అన్నా మీరు అడిగింది? ."

-" అవును యాది. రోజు ఈ టైం  కల్లా ముగ్గేయడానికి వచ్చేది. ఇవ్వాళ ఇంకా రాలేదే ?."

-" అదొక పెద్ద కథలే అన్న నువ్వు లేని ఈ మధ్యకాలంలో చాలా చాలా జరిగాయి"

-"ఏమైంది యాది ?" అని అడుగుతున్నంత లోనే సతీష్ నుంచి ఫోన్. - " ఏరా ఎక్కడా ??"

-"ఇక్కడేరా మన కాఫీ అడ్డా "

-" నేనొస్తాను అక్కడే ఉంటావా ? లేక ఇంటిదగ్గర ఉన్నా ఇక్కడే కలుద్దామా ?" అని అడిగాడు సతీష్.

-" నేనే వస్తాలేరా ఇక్కడ కన్నా ఇంట్లోనే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకో మళ్ళీ వర్షం పడుతుందేమో అన్న సందేహం నాకు. వస్తున్నా ఉండు " అని సతీష్ ఫోన్ కట్ చేశాడు.

-" యాది మళ్ళీ రేపు కలుస్తా మాట్లాడుకుందాం ". అని ఇంటికి వెళ్ళడానికి తన పల్సర్ బండిని  స్టార్ట్ చేసాడు.

                                                       *  *    *   *   *    *  *

 ఆకాశ్ బండి పై నుంచి దిగగానే వెళ్లి కౌగలించుకున్నాడు సతీష్.  -" అరేయ్ ఆకాశ్ రెండేలలలో మంచి కలరొచ్చావ్ గా బావా " అని చేతులు పట్టుకొని లోనికి నడిచారిద్దరూ.

-" కలరా ? నా మొహమా ?? ఆ వాతావరణానికి ఎవరెళ్లినా అలాగే అవుతారు గాని నీ సంగతేంటి చెప్పు. ఇలా తయారయ్యావ్? బక్క చిక్కావ్. నల్ల బడ్డావ్ . నొసటి మీదున్న జుట్టు ఇంకా ఊడినట్టుందే ? "

-"అంతే అంటావా బావా ? "
అని   అద్దంలో చూసుకుంటూ చెవుల మీద కొచ్చిన వెంట్రుకల్ని ముందుకు చేతితో లాగుతూ సవరించుకుంటూ.. మొహం అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటున్నాడు సతీష్.

-"చూసుకున్న వరకు చాల్లేరా బాబు "- అని వెనక నుంచి కాలర్ పట్టుకొని లాగి తన రూంలోని సోఫాలోకి నెట్టాడు సతీష్ ని. తను కూడా ఆ పక్కనే ఉన్న మంచంపై కూర్చొని వెనక ఆసరాకి తలగడ పెట్టుకొని సతీష్తో మాట్లాడడానికి  ఉపక్రమించాడు.

-"చెప్పురా సతీష్ అంతా ఓకే కదా ..? ఇంట్లో  అమ్మా , చెల్లీ , తమ్ముడు అందరూ బాగున్నారా ?"

-" బాగున్నార్రా. నువ్వు వచ్చావని నిన్నే లీవ్ తీసుకుందామని అనుకున్నా. నువ్వేమో వద్దన్నావు. ఇవ్వాళ అందుకే ఉదయమే వచ్చేశా వీక్ ఎండ్ కదా. " నవ్వుతూ చెప్పాడు సతీష్.

-"భలే వాడివిరా బాబు. సాయంత్రం అందరం కూర్చుందాం  అని నైతిక్ గాడికి ఫోన్ చేశా. నీకు బోస్ గాడికి కూడా నన్నే చెప్పమని ఫోన్ పెట్టేశాడు ఆ దొంగ డ్యాష్ గాడు."

-"వాడి గురించి నీకు తెలుసు కదరా. ఆరేళ్ళుగా కష్టపడుతున్నాడు. ఈ సారి ఎలా అయినా IPS కొట్టాలని కసి మీదున్నాడు. మమ్మల్ని కలవడం కూడా చాలా తగ్గించాడు. ఈ సారి తీవ్రంగా శ్రమిస్తున్నట్టుంది. " అని చెబుతూ పక్కనే ఉన్న షెల్ఫ్ లో ఆకాశ్  వాడే పెర్ఫ్యూమ్ వాసన చూస్తున్నాడు.

-"కష్టపడక పొతే వాళ్ళ నాన్న ఊరుకుంటాడా?? నేనున్నా డిపార్ట్మెంట్ లో నువ్వు హయ్యెర్ పొజిషన్ తో రావాలి అంటూ చిన్నప్పటి నుంచే వాణ్ని ట్రైన్ చేస్తుంటే. ఉదయం ఫోన్ పెట్టేసేముందు అడిగా వాణ్ని 'సీమ' విషయం ఏం చేసావురా ? అని సమాధానం ఇవ్వలా కొడుకు. సాయంత్రం కలవనీ బొక్కలిరగ కొట్టుడే వానికి" అంటూ సతీష్ వైపు జరిగాడు ఆకాశ్. ఆ మాటలు విని  -'హ .. హ హ .. హ హ హ ..'' అని  గట్టిగా నవ్వాడు సతీష్.

-"ఏంట్రా అంతగా నవ్వావ్ ".

- " లేక పొతే పాపం మనందరం కలసి డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి వాడి మీదే ఆశలు పెట్టుకుంది ఆ పిల్ల. వాడి పీజీ అయ్యి ఇప్పుడు ఆరేళ్ళు. ఆ  అమ్మాయి వాళ్ళింట్లో ఎన్ని మాటలు పడుతుందో. వస్తున్న సంబంధాలన్నీ చెడగోడుతూ ఇన్ని రోజులు ఏదో ఒక సాకు చెప్పింది. తను కూడా సివిల్స్ కోచింగ్లో చేరింది. వాళ్ళింట్లో  వాళ్ళు ఆ అమ్మాయి తిక్క కుదిరే లోపు చిన్నది పెళ్ళికి రెడీ అవుతుందని గమనించి ఒక రోజు పెళ్లి చూపుల్లో ఇద్దరినీ కూర్చోబెట్టారట. చిన్న పిల్లే నచ్చింది అని వచ్చిన వాళ్ళంటే చేసేది లేక ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. "

-"అవునా ఈ సాయంత్రం నైతిక్ గాడికి నా చేతుల్లోనే మూడింది. యెదవ ముందునుంచీ ఇంతేరా వాడు. అన్నీ సర్కీట్ లెక్కలే చేస్తాడు. "అన్నాడు ఆకాశ్.

ఈ విషయం కన్నా ఇంకా పెద్ద విషయం ఏదో ఉంది అన్నట్టు ఆకాశ్ మొహానికి దగ్గరగా తన మొహం తెచ్చి -"అవునురా నీ ఫేస్ బుక్ లో ఫోటోలు చూసా ఆ మధ్య ఎవరో అమ్మాయితో. ఆ అమ్మాయి ఎవరు?. నువ్వు కూడా వానిలా షాక్ ఇవ్వవు కదా ? ఆ బోస్ గాడి దెబ్బకు ఇంకా కుదురుకోలేదురా బాబు నేను అసలు " అని విషయం అడిగాడు సతీష్.

-" నేనా బోస్ లాగానా " అని ఆకాశ్  నవ్వడం మొదలు పెట్టగానే సతీష్ కూడా ఆ నవ్వులతో తన నవ్వులు కలిపాడు. పొట్ట చెక్కలయ్యేలా ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. బోస్ పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ.

-" అలాంటిదేం లేదురా సతీష్ తను నా కొలీగ్ అంతే . కాక పొతే కొంచెం చనువు ఎక్కువ. తెలుగొణ్ని కాబట్టి. అమ్మాయి మంచిదే కాని నాకు కావలసిన సుగుణాలన్నీ లేవు అందుకే ...  " అని సాగదీస్తూ మాటలు ముగించాడు ఆకాశ్ .

-" నీ సంగతేందిరా?  చెల్లి పెళ్ళికి అంత కష్టపడకుండా  నాకు అట్లీస్ట్  ఒక ఫేస్ బుక్ మెస్సేజ్ ఇవ్వచ్చు కదా. లేదా  ఒక ఫోన్ కాల్. నువ్వెప్పుడూ ఇంతేరా అస్సలు. కొంచెం కూడా మనోళ్ళు అని అనుకోవు. " అంటూ తన పక్కనున్న తలగడ తీసుకొని సతీష్ తలపై కొడుతూ అడిగాడు ఆకాశ్ .

-"నువ్వు నాకు బయటోడివేందిరా బాబు ? నువ్వక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటావో తెలియదు. ఎందుకు నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయడమని చెప్పలేదు. అనుకుంటూ లేచి గది మూలలో ఉన్న బల్లపై ఉన్న మంచి నీళ్ళ సీసా తీసుకొని వచ్చి కూర్చిని మెళ్ళిగా నీళ్ళు తాగాడు సతీష్.

చెల్లి విషయం గుర్తు చేయగానే ఎందుకో డల్ అయ్యాడని గ్రహించాడు ఆకాశ్. నీళ్ళు తాగడం అవగానే తానే నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాడు సతీష్. - " మంచి సంబంధం. పెళ్లి చేసేయొచ్చు అని వచ్చిన చుట్టాలందరూ తలా ఓ మాట అని వెళితే, పీ. జీ చదువుతాను అని అన్నా వినకుండా పెళ్లి చేశాం. తమ్ముడి చదువు భాద్యత కూడా నాదేగా అమ్మేమో - ' ఎందుకురా అదంత చదువుకుంటానని వాళ్ళ అత్త వాళ్ళను ఒప్పిస్తే వాళ్ళే చదివిస్తారు. రెందేల్లయితే తమ్ముడు ఇంజనీరింగ్ కోసం  సిద్ధపడతాడు. నీకు కష్టం అవ్తుంది. ' అని కన్నీరు పెట్టుకుంది. నాన్న పోయాక వచ్చిన డబ్బు కొంత బ్యాంకులో ఉంది కదా, అది అలాగే నేను లోనికి అప్లయ్ చేశా ఆ మొత్తం కలిపి ఒక పదిలక్షలు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశా".. కానీ .. కానీ అని తలకిందకేసి సన్నగా నిట్టూర్చాడు సతీష్.

వెంటనే భుజం మీద చేయేసి కదుపుతూ - " హా ఏమైందో చెప్పు రా ?? ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా ? " అంటూ అడిగాడు ఆకాశ్ . గుండెల నిండా గాలి పీల్చుకొని చెప్పడం మొదలుపెట్టాడు సతీష్. - " పెళ్ళైన  రెండునెలల తర్వాత చెల్లిని ఇంటికి పంపాడు.  కారు కొనుక్కొని ఇంటికొస్తేనే మళ్ళీ రా. లేకపోతే తెచ్చేవరకు అక్కడే ఉండు అని. నాన్న మాకిచ్చిన ఆస్తి మేముంటున్న యిల్లే నీకు తెలుసుగా తమ్ముడి చదువు కోసం దాచుంచిన డబ్బుకొంత.  మళ్ళీ లోన్ తీసుకొని కార్ కొని పంపాం. పెళ్ళైన మూడో నెలే తను నెలతప్పింది. శ్రీమంతం అదీ ఇదీ ఎలాగో కానిచ్చాం. కాని వాళ్లత్త , ఆ అబ్బాయి మగపిల్లోడైతే సరి లేక పోతే ఏం జరుగుతుందో చూపిస్తాం అంటూ వేధింపులు , దబాయింపులు. ఇప్పుడు ఏడో నెల దాని మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో B.P ఫ్లక్చుయేట్  అవుతుంది. నాకేమో ఈ ఆగస్ట్ లో అప్రైసల్ ఉంది. మేనేజర్ పొజిషన్ వస్తుందేమోనని రాత్రింబగళ్ళు కష్టపడ్తున్నా రేటింగ్ కోసం ".. హ్మ్మ్ ఇదీ నా కథ నిన్ను విసిగించాను కదా సారీ.

-" అవున్రా బాబు చాలా విసిగించావ్ నోరుముయ్యి భే. ఇలాంటి సమయాల్లో కాకపొతే ఎప్పుడ్రా స్నేహితులు. కాని ఈ మధ్య ఆడపిల్లల పరిస్థితి ఆలోచేస్తేనే నాక్కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకురా ఇలా కొంత మంది మగవాళ్ళ వల్ల మనందరం చెడ్డపేరు మోయాల్సి వస్తుంది. మొన్న అమెరికాలో ఉన్నప్పుడు కూడా అదే ఆ అమ్మాయి ఫోటోలో ఉందే ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని కూతురునైతే ఏకంగా అత్తింటివారు చంపేశారని. అందరూ మామూలు చావే అనుకున్నారు ఇక్కడినుంచి దీప్తి ఫోన్ చేసి చెప్పే వరకు తెలియలేదు హత్య అని. దీప్తి వాళ్ళ కజిన్ ఎప్పుడూ తనతో షేర్ చేసుకునేదట లేక పొతే తెలిసేది కాదు.  పాతిపెట్టి మూడు రోజులయ్యాక శవానికి పంచనామా చేసారు. అప్పుడు హత్య అని నిర్ధారణ అయ్యింది.  ఆ రోజు దీప్తి ఏడుస్తూ - " ఎందుకు ఈ మగవాళ్ళందరు  ఇలా ఉంటారు? అమ్మలు చెప్పింది విని డబ్బు కోసం పెళ్లి చేసుకున్న భార్యనే చంపేస్తారా ?? అత్తలైనా ఒకప్పటి కోడళ్ళే అన్న విషయం మర్చిపోతారా ?? " అని అడిగిన ప్రశ్నలు నాకు ఇంకా గుచ్చుకుంటూనే ఉన్నాయిరా.
- " చూడు అంటూ లాప్ టాప్ తెరిచి స్త్రీలపై జరిగే అత్యాచారాలు .. బ్రూణ హత్యల గురించి ఇద్దరు చర్చించుకున్నారు.

మాటల్లో టైం  అయిదు కావచ్చింది. బోస్ , నైతిక్ ల దగ్గర నుంచి ఫోన్. - " మేం బయలు దేరుతున్నాం రా ఆకాశ్. అర్ధ గంటలో నీ ముందుంటాం " అని ఫోన్ కట్ చేసారు.

                                                           *   *    *    *    *   *    *

-"అరేయ్  ఆకాశ్ ఎలా ఉన్నావ్ రా ?? అని బోస్ ఆకాశ్ ని కౌగలించుకున్నాడు.  -" వీడికేంట్రా  హీరో అని నైతిక్ షేక్ హ్యాండ్ ఇచ్చి  భుజమ్మీద చెయ్యేసి దగ్గరగా లాక్కున్నాడు. "

" ఏంట్రా బోస్ , నైతిక్ గాడి సంగతి తర్వాత చెబుతా ముందు నీ సంగతి చెప్పు.  చెప్పాపెట్టకుండా లవ్ ఎప్పుడు నడిచింది ?? పెళ్లెలా ఫిక్స్ అయ్యింది ??. మీ నాన్నని ఎలా మ్యానేజ్ చేసావ్ ? మొత్తానికి పెళ్లై ఆరునెలలైనా అవ్వడం లేదు. అప్పుడే బెలూన్ లా ముందుకొచ్చింది పొట్ట. అంకుల్ అయిపోయావ్రా నువ్వు " అంటూ నవ్వుతూ వాళ్ళు తినడానికి తెచ్చిన స్టఫ్  లోంచి చిప్స్ తీసుకొని తింటూ నైతిక్ ని తన మోచేతితో పక్కలో పొడిచాడు.

"ప్రొడ్యూసర్ కష్టాలు ప్రొడ్యూసర్ వి , హీరోయిన్ కష్టాలు హీరోయిన్ వి అన్నట్టు ఉందిరా ఇప్పుడు పరిస్థితి. మీకేం ఇంకా పెళ్లి వయసు రానట్టు బిల్దప్పులిస్తున్నారు. చూస్కోండి ఇంకో సంవత్సరం ఆగితే ఏ అమ్మాయి మీ వైపు అబ్బాయిల్ని చూసినట్టు చూడదు అంకుల్ కొంచెం పక్కకి జరగండి అనకపోతే " అంటూ షర్టు చేతుల్ని పైకి మడిచి ఇన్ షర్ట్ తీసేస్తూ -" ఏం చేస్తాం ? ఇంట్లో వాళ్లకు నచ్చే వేషాలు బయటవేయలేం కదా"  అని సతీష్ పక్కన కూర్చున్నాడు.

-" అవునవును వీడు ఆ అమ్మాయిని లేపుకోలేని సాంఘిక టెంపుల్ దగ్గరకొచ్చి, నన్ను ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచే వరకు తెలియలేదురా  వీడి కతలు ఆ పిల్లేమో - 'అన్నయా ఈయన్ని చేసుకోకపోతే నేను చచ్చిపోతా నంటుంది" ఆ ఇంట్లో ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారంటూ . వాళ్ళ నాన్న భయంతో వాడు అన్ని రోజులు ఆగినా ఆ పిల్ల పెళ్లి ఫిక్స్ అయ్యాక ధైర్యం తెచ్చుకున్నాడు. " అంటూ సతీష్ చెబుతున్నంతలో నైతిక్  అందుకొని
- " వీడు ధైర్యం తెచ్చుకోవడమేందిరా సామి ఆ పిల్లే వీడికి ధైర్యం నూరి పోసింది. లేకుంటే వీడి మొఖానికి వాళ్ళ నాన్నకు ఎదురు నిలబడతాడా ?? ఆ రోజు గుర్తుందా వీడు మూవీ ఫీల్డ్ అంటే వాళ్ళ నాన్న ఏం చేసాడో?. " అనగానే ఆకాశ్ , సతీష్ కలిసి నవ్వారు.

-"సరే సరే లేవోయ్ నేనైనా అటో ఇటో చేసి పెళ్లి చేసుకున్నాను. నువ్వుబే  మరి. పాపం ఆ పిల్ల 'సీమ' ఇంకా నీ కోసం చూస్తుంది. దేవతరా ఆ పిల్ల. అట్లా ఎదురుచూసే పిల్లలు ఇయ్యాళ రేపు ఎక్కడుంటార్రా ??'' అరేయ్ అదేదో క్లాస్ పీకుతా అన్నావ్ గా ఇక మొదలు పెట్టు ఆలస్యమెందుకు? కెమెరా , లైట్స్ , యాక్షన్ అని అనడం గురించి చూస్తున్నట్టున్నాడు వాడు. వాడు వాడి మొహం. చూడు " అని నైతిక్ గడ్డం పట్టుకుని పైకిలేచాడు.

-"సీమ విషయం దేశ భద్రతకు సంబంధించి కాదుకాని వేరే విషయాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడండిరా ప్రస్తుతం అది పక్కన పెట్టండి ప్లీజ్ " అని సోఫా పై నుంచి లేచి మంచంపై రెస్ట్ తీసుకోడానికి ఒరిగాడు.

                                                          *  *   *   *   *   *  *

-" నైతిక్ బీర్ తాగుతావా ఇదో" అంటూ బయటికెళ్ళి సతీష్ తెచ్చిన బీర్ బాటిల్స్ కొన్ని పర్సనల్ ఫ్రిజ్లో పెట్టాడు ఆకాశ్.

-" ఎప్పుడూ వద్దు , వద్దు అంటూ నాటకాలాడే వాడురా. వీడు ఇవ్వాళ ఒక్క మాట నువ్వు అడగ్గానే ఎట్ల ఉషార్ అయ్యిందో చూడు అంటూ" సతీష్ ని చూసి కన్ను కొట్టాడు బోస్. సమాధానంగా నవ్వాడు సతీష్.

ఒక బీర్ తాగాక మెళ్ళగా - " ప్రాణంలో ప్రాణంగా , మాటల్లో మౌనంగా చెబుతున్నా.. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళ్తున్నా.. మొన్న కన్న కల , నిన్న విన్న కధ రేపు రాదుకదా జతా.." అంటూ పాడుతూ టెర్రస్ పైన ఓ మూల పిట్టగోడ ఎక్కి కూర్చున్న నైతిక్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆకాశ్ - " ఏంట్రా ప్రాబ్లెమ్ ?!, ఎందుకు ఆ అమ్మాయిని అలా అవాయిడ్ చేస్తున్నావ్ ??" అని అడిగాడు.

-" ఎం లేదురా సీమంటే నాక్కూడా చాలా ఇష్టంరా !! కాని ఏం చేయాలి ఒకవైపు నాన్న ప్రెషర్. ముందే ఈ  సర్వీసస్ కి సిద్ధపడటం కుదరట్లేదు అని వదిలేస్తే వేరే కరియర్ , వేరే జీవితం ఉండేది. ప్రతి సంవత్సరం రిజల్టు చూసుకుని నిరుత్సాహ పడడం. ప్రిలిమ్స్ వరకి వెళ్లి మెయిన్స్ లో వెనక్కి రావడం ఒక ఎత్తైతే , మెయిన్స్ వరకు వెళ్లి కూడా ప్రూవ్ చేసుకోలేదేంటి అన్న బాధ ఇంకొక వైపు. అమ్మా నాన్న అందరికి మా వాడు ఎలా అయినా IPS అయితీరుతాడని ప్రతి చుట్టానికి , దారిన పోయే వానికి , ఇంటి చుట్టుపక్కలోల్లకి చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు నేను కనిపిస్తే గౌరవంగా చూస్తే మరి కొందరు జాలి గా, వెటకారంగా చూస్తూ హాస్యంగా మాట్లాడడం నాకు బాధేస్తుందిరా. అందుకే ఎవ్వరికీ కనబడకుండా ఒక్కన్నే ఉంటున్నా. ఇక సీమ పరిస్థితి అంటావా? అది పిచ్చిదిరా .. చాలా చాలా మంచిది .. నేను నా కెరియర్ లో సెట్ అవ్వకపోతే దాన్ని బాగా చూసుకోలేను. ఆ పిల్ల లైఫ్ పాడు చేసినట్టవుతుంది. నాన్న ఇప్పటికే చాలా డబ్బు నా చదువు కోసం , కోచింగ్ కోసం ఖర్చు పెట్టాడు.   నేను IPS ఆఫీసర్ అయితే అదంతా కట్నంగా లంచాలుగా రాబట్టొచ్చని ఆయన ఆలోచన. కాని ఆకాశ్ నేను కాని ఈ సారి IPS సెలెక్ట్ అయితే మొదట చేసే పని సీమ ని పెళ్లి చేసుకోవడమేరా.. ఐ రియల్లీ లవ్ హర్ రా .. ఐ మిస్ హర్ అలాట్ " అంటూ ఏడ్చేసాడు నైతిక్ .

-" హే నైతిక్ బాధ పడకురా .. లుక్ .. లుక్ ఎట్ మీ .. దిస్ టైం యు ఆర్ గోయింగ్  టు రాక్ మ్యాన్ .. సక్సెస్ ఈస్ యువర్స్ " అని ఆకాశ్ దగ్గరకి తీసుకుంటే - " నువ్వు నిజంగా మాయామచ్చింద్రా వి రా " అని బోస్ అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు.

-"ఇదంతా సరేగాని ఆకాశ్ , అందరి గురించి అడుగుతున్నావ్ . పెళ్ళిళ్ళ గురించి ఇంత ముచ్చటపెడ్తున్నావ్. ఇంతకు నీ పెళ్లి సంగతి మాట్లాడవేంది బావ ?? ఎవ్వరినైనా ప్రేమించావా ?? అదే ఇష్క్ , కాదల్ లవ్ లాంటిది అయ్యిందా ?? లేక అరేంజ్ మ్యారేజ్ కే సై అంటావా ?? " అని అడిగాడు బోస్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ సిప్ చేస్తూ..

-" లవ్వ్ .. అలాంటిదేం లేదు గాని, అమెరికా వెళ్ళాక అర్ధమైందిరా మన సాంప్రదాయాలున్న పిల్ల దొరకడం ఎంత అదృష్టమో అని. కష్టపడి ఇంటికొచ్చిన భర్తకు సంధ్యా సమయంలో భూమిని చల్లగా వెలిగించే చంద్రునిలాంటి నవ్వుతో , ఉదయాన్నే పూలపై పడ్డ మంచుబిందువుల్లాంటి మాటలతో .. ప్రక్కనే నా నీడగా , తోడుగా నడుస్తూ నా లో  నిత్య వసంత రుతువుగా ఉండాలి. ఎక్కువగా ఆశిస్తున్నా కదూ .. ?!. ఉదయాన్నే అమెరికాలో వాకింగ్ కి వెళ్ళేప్పుడు వాకిళ్లో ముగ్గేసే ఆ అమ్మాయి కనిపించేదిరా. తెలియకుండానే ఎందుకో , ఆహ్లాదంగా , ప్రశాంతంగా .. ఆ రోజంతా అందంగా గడిచేది. " అని చెబుతున్నంతలో సతీష్ కి పొరమారింది. - " ఏంటి ముగ్గేసే అమ్మాయా ?? అబ్బాయ్ హోటల్ దగ్గర అమ్మాయి గురించేనా నువ్వు మాట్లాడేది ? " తను విన్నది నిజమేనా అని ధ్రువపరుచుకోడానికి అడిగాడు సతీష్. చాలా మెళ్లిగా ఒక్కొక్క పదం విడదీస్తూ. బోస్ నైతిక్ ఇద్దరూ తాగడం మానేసి ఒక్కసారి ఆకాశ్ వైపు కొత్తగా చూసారు .

" అవున్రా ఆ అమ్మాయే . దీపావళి కాంతి అంతా ఆ అమ్మాయి ముఖంలోనే దాగున్నటనిపిస్తుంది. నన్ను ఓరకంట చూసేప్పుడు కావాలనే నేను పట్టించుకునే వాణ్ని కాదు. తను ఆ వేళ్ళతో ముగ్గు పెట్టేప్పుడు నా గుండెపై ప్రతి రోజు కృష్ణశాస్త్రి కవితేదో రాస్తున్నట్టు, ఆ కవితలోని భావుకతతో నన్ను ఆకర్షిస్తున్నట్టు అనిపించేది. తలంటు పోసుకొని కట్టుకున్న టవల్ ముఖంపై పడే ముంగురులు నన్ను పిలిచి సరి చేయమనేవి.  ముగ్గుపెడుతూ అటూ ఇటూ దాటుతూ వేసే పాదాలు వాటితో వచ్చే పట్టీల శబ్ధం నన్ను చేయి పట్టుకొని ప్రక్రుతి ఒడిలోకి నదిపించుకెళ్లె నండూరి ఎంకిలా అనిపించేది. ఇక్కడున్నని రోజులు పట్టించుకోలేదు. గాని ' యు .ఎస్ ' వెళ్ళాక ఆ అమ్మాయితో ఒక్కసారైనా మాట్లాడాలనిపించేది. తన పేరైనా తెలుసుకోమని మీకు పురమాయించాలనిపించేది. మళ్ళీ మీరు నన్ను గేళి  చేస్తారని చెప్పలేదురా.  కాని నేను' యు . ఎస్ ' వెళ్ళే ముందు రోజు తను నన్ను చూసిన చూపులు , కనిపించకుండా నా వరకు పంపిన నవ్వు నా హృదయంలో నాటుకుపోయాయిరా. " అని మాట్లాడుతూ వారి వైపు చూసాడు. తాగకుండా అక్కడున్న స్టఫ్ కూడా తినకుండా ఆ ముగ్గురు స్నేహితులు ఆకాశ్ వైపు  కన్నార్పకుండా చూస్తున్నారు.

" అరేయ్ బోస్ ఏంట్రా అలా దిష్టి బొమ్మను చూసినట్టు చూస్తున్నారు. నేను నార్మల్ గా ఉన్నా మీరెందుకు ఇంత అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు ?" అని అడిగాడు ఆకాశ్.

-" ఏం లేదు బావా నేను తాగిందంతా దిగిపోయింది. నాకిప్పుడు ఇంకో బీర్ కావాలి." అని బోస్ కూర్చున్న దగ్గర నుంచి లేచి నిలబడ్డాడు. - " నాక్కూడా .. నాక్కూడా రా "  అంటూ సతీష్ , నైతిక్ కూడా అనే సరికి ఆకాశ్ కి ఏమర్ధమవలేదు . సరే నేను తెస్తాను మీరుండండి అని ఈల వేస్తూ ఉత్సాహంగా ఢాబా దిగి వెహికల్ తీసుకొని
వెళ్తుంటే ముగ్గురు పైనుండి ఆకాశ్ వైపే చూస్తూ నిలబడ్డారు.

                                                      *   *    *   *    *    *   *   *

బీర్ బాటిల్స్ తో ఆకాశ్ వచ్చేప్పటికి ముగ్గురూ ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు. - " జరిగిన విషయం ఆకాశ్ గాడికి చెప్పొద్దు. తెలియనీయొద్దు. ముఖ్యంగా అరేయ్ బోస్ నువ్వు. నువ్వు గాని నోరు విప్పావో నా చెఉత్ల్లొ నీకు మూడింది అంతే. " అంటూ సతీష్  వార్నిగ్ ఇస్తుంటే వింటూ పైకొచ్చాడు. తలా ఓ బాటిల్ అందుకొని ఏమీ మాట్లాడకుండా తాగుతుంటే వాళ్ళ ప్రవర్తనపై ఆకాశ్ కి అనుమానమొచ్చింది.

- " ఏంట్రా అందరూ అలా సైలెంట్ గా ఉన్నారు. అంతా ఓకే  కదా " అడిగాడు ఆకాశ్

-" హా ఓకే బావా .. అంతా  ఓకె .. ఎవ్రీతింగ్ ఈస్ ఆల్రైట్ అన్నాడు బోస్ .

" ఒరే బోస్ నువ్వు నోరు మూస్తావా ? ? చాలా ఎక్కింది నీకు ఇక వెళ్దాం " అన్నాడు నైతిక్  .

-" ఏంట్రా నా పెళ్లి ప్రస్తావన  చెప్పగానే ఇలా చల్లబడ్డారు.  మీ అందరికీ షాక్ ఇచ్చాను కదా  అని కొంచెం సిగ్గుపడుతూ నవ్వాడు ఆకాశ్ .

" బావా నిజంగానే షాక్ ఇచ్చావ్ బావా నువ్వూ .... తాగి మత్తుగా మాట్లాడుతూ బోస్ . నువ్వు మంచి దిల్ ఉన్నోడివి బావా . నువ్వెప్పుడు  కుష్ ఉండాలే . హ్యాపీగా ఉండాలే . " అని బోస్ అన్న మాటల్లో ఏదో వీళ్ళు దాస్తున్నారని  చూచాయగా అర్ధమయ్యింది.

-" రేయ్ బోసు నీకు పగిలిపోద్ది . ఇక జోకులాపు కన్నా .." అని రాణి నవ్వు మొహంపై తెచ్చుకున్న సతీష్ ఏదో దాస్తున్నాడని ఆకాశ్ కి అర్ధం అయ్యింది.

" సతీష్ నిజం చెప్పు ఏమయ్యింది? ఏదో దాస్తున్నారు. నేను వచ్చేప్పుడు నువ్వు బోస్ గాడికి వార్నింగ్ ఇవ్వడం నేను చూసాను" అని ఆకాశ్  కూర్చున్న దగ్గర నుంచి లేచి నిల్చున్నాడు.

-" బావా అదీ.. అదీ .. ఏమయ్యిందంటే "అన్నాడు నైతిక్ ..

-" ఏమయ్యిందో చెప్తారా నాకు కోపం రాకముందే" అని మళ్ళీ తన స్థానానికి వచ్చి కూర్చున్నాడు ఆకాశ్.

" కొద్దిగ్గా మత్తెక్కిన మాటలతో నేను చెప్తా బావా .. " అంటూ ముందుకు ఆకాశ్ కి దగ్గరగా జరిగి ఆకాశ్ కుడికాలు పట్టుకొని - " ఆ అమ్మాయి .. అదే ఆ ముగ్గమ్మాయి సునీత చనిపోయింది బావా " అని మత్తులో బాధగా చెప్పాడు బోసు.

-" అక్కడికక్కడే భూగోళం భ్రమించడం ఆగిపోయినట్టు , గాలి వీయకుండా శిలలా మారినట్టు , నెత్తిపై చీకటి విరిగి దబీమని పడి ఊపిరాడనట్టు అనిపించింది ఆకాశ్ కి .

పరిస్థితి గమనించి విషయాన్ని చెప్పడం తన పనిగా స్వీకరించాడు సతీష్ - " అవున్రా బావా . ఆ అమ్మాయి చనిపోయింది . ఆ అమ్మాయి చనిపోవడం వెనక పెద్ద కధే ఉంది. " అని కూర్చున్న స్థలంలో తన ముఖంపై పడుతున్న లైట్ వెలుతురు నుంచి తప్పుకొని చీకటిగా ఉన్న వైపు నడుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు సతీష్ .

-" అవును బావా ఆ అమ్మాయి చనిపోయింది. నిర్దాక్షిణ్యంగా చంపబడింది అనడం బాగుంటుందేమో... !! నువ్వన్నది నిజమే బావా మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదూ ఆ ముగ్గేసే అమ్మాయి గురించి ఆ రోజే నువ్వన్న మాటలని బట్టి నీకు ఆ అమ్మాయి మీద సాఫ్ట్ కార్నర్ ఉందని అర్ధమయ్యింది. నువ్వు అమెరికా వెళ్ళిపోయాక ఒక రోజు ఉదయం నేను, నైతిక్ , బోస్ గాడు కాఫీ తాగడానికి వెళ్లాం. మనం ఎప్పుడూ కూర్చునే స్థలంలో కూర్చొని మాట్లాడుతున్నాం. ఎప్పటిలానే ఆ అమ్మాయి ముగ్గేసింది. ఎప్పుడూ తిరిగి చూడనిది కొద్ది సేపు నిల్చుని చూసింది. నాకెందుకో నీ గురించి వెతుకుతుంది అనిపించింది. సరిగ్గా వారం రోజుల తర్వాత నైతిక్ గాదు నేను కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు ముగ్గేసేది ఆపి వచ్చి నీ గురించి అడిగింది. నువ్వు ఆన్ సైట్ వర్క్ పై అమెరికా వెళ్ళావని చెప్పాం. నేలకు ముఖమేసుకొని ఆ ముగ్గు వేసేసి ఇంట్లోకెళ్ళింది. కొన్ని రోజులయ్యాక ఆ ఇంటి ముందు పెళ్లి పందిరి కనిపించింది. అబ్బాయ్ హోటల్ యాదిగాడు చెప్పాడు -" సునీత మేడం పెళ్లి ఇంకో రెండు రోజుల్లో, వాళ్ళ నాన్న చెప్పాడు . పెళ్లి కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్ " అని.

- " పోలీస్ ఇన్స్పెక్టరా ? " సతీష్ ని ఆపి అడిగాడు ఆకాశ్.

-" పోలీస్ ఇన్స్పెక్టరే . ఆ తర్వాత నాలుగు నెలలకే ఆ ఇంటిముందు ఆ అమ్మాయి శవం. తరువాత రోజు న్యూస్ పేపర్లో ఆ అమ్మాయి ఆత్మ హత్య ఉదంతం గురించిన కథనం చూపించి TRP పెంచుకున్న న్యూస్ చానెళ్ళు "

" ఏం రాసిందిరా సూసైడ్ నోట్ లో తను " బాధగా అడిగాడు ఆకాశ్.

" అది సూసైడ్ నోట్ కన్నా ఆ అమ్మాయి తన అమ్మా , నాన్నలకు రాసిన ఉత్తరం.
అమ్మా , నాన్న .. !
నాకు పెళ్లి వద్దు అంటున్నా మంచి సంభందం అని పెళ్లి చేశారు. ఒక్క రెండేళ్ళ తర్వాత చేసుకుంటానని అప్పటివరకు ఏదో ఒక కోర్సులో చేరతానని చెప్పినా నిర్దాక్షిణ్యంగా కుదరదన్నారు. మీకున్న రీసన్స్ మీకున్నాయి నాకు తెలుసు. మీ మనసు మారదని తెలిసి నన్ను నేను ఒప్పించుకొని , సర్ది చెప్పుకొని మీ కోసం , కేవలం మీ కోసం మాత్రమె ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కాని పెళ్ళయ్యాక ఈ నరకం భరించలేక పోతున్నానమ్మ . బ్రతకాలని లేదమ్మా  .. ఇతను నన్ను బ్రతకనీయడం లేదమ్మా... పెళ్లి ముందు రోజే నాకు ఒకరిపై ఉన్న ప్రేమను అనచివేసుకొని , తుడిచివేసుకొని పవిత్రంగానే పెళ్ళికి సిద్ధపడ్డాను. పెళ్ళయిన వారం తరువాత తన గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఫేస్ బుక్ లో కొంత మందిని చూపించాడు. నీకు కూడా డిగ్రీలో , పీజీలో బాయ్ ఫ్రెండ్స్ కాకపోయినా , అభిమానించిన వాళ్ళు ఎవరూ లేరా అని అడిగాడు. అన్యోన్యంగా ఉండడంలో తప్పు లేదు కదా అని నా వన్ సైడ్ లవ్ గురించి చెప్పా. అతడి పేరు ఆకాశ్ అని నాకు తన గురించి తెలుసు గాని తనకు నేను నా పేరు కూడా తెలియదని చెప్పాను. కాని తను నమ్మలేదమ్మా. రోజు కొట్టే వాడు, హింసించే వాడు.. ఆకాశ్ పేరు చెపుతూ నా అంగాంగం స్పృశిస్తూ ఎలా ఉందొ చెప్పమని హింసించాడు. నన్ను బాగా చూసుకుంటాడని ఈ రాక్షసుడి కిచ్చారు. రక్షణ కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితి. నేను చెప్పినా ఎవరూ నమ్మరని తెలుసు. ఎందుకంటే తన డిపార్ట్మెంట్ లో తను అంత మంచి నటుడు. రోజు రోజు నరకం పెరిగిపోయిందమ్మా .. పాల వాడితో , పేపరు పిల్లోడు, కూరగాయల వాడితో ఎవ్వరినీ వదలకుండా సంభందం అంతకట్టి చిత్రవధ చేస్తున్నాడు. మానసికంగా నన్ను చంపేసాడు. నాకు బ్రతకాలని లేదు. మీ దగ్గరకి వచ్చేద్దాం అనుకున్నా మీకు పరువు, మీ బాధ్యతలే ముఖ్యం కదా నాన్న . ఒక రెండు రోజులు ఇంటికొస్తా నని నేను అడిగినా ఏ  రోజు నువ్వు నన్ను తీసుకెళ్లడానికి రాలేదు. ఏమో వచ్చుంటే మీతో నా భాధలు పంచుకునేదాన్ని. నా మరణానికి అతడే బాధ్యుడో మీరు బాధ్యులో మీరే తేల్చుకోండి . ఇక ఈ జీవితానికి సెలవు. " అని ఉందిరా అంటూ సతీష్ చెప్పడం ముగించాడు.

కొద్ది సేపు వాళ్ళున్న వాతావరణం అంతా ఘనీభవించింది. ఎవరి దగ్గరా మాటలు లేవు. కూర్చున్న స్థలం నుంచి లేచి  వీధి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ నిల్చున్న ఆకాశ్ భుజంపై చేయెసి - " ఆకాశ్ హాప్ యు విల్  ఫైన్ బావా " అన్నాడు నైతిక్.

దాచిపెట్టినా దాగని కన్నీళ్లు. తన కళ్ళలో తనని అంతగా ప్రేమించిన అమ్మాయి కళ్ళను తాను  పసిగట్టలేక పోయానే అన్న బాధ. మెళ్లిగా వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు.

- " ఎన్ని రోజులురా .. ఇంకెన్ని రోజులు ? ఇలా అమ్మాలని మనమే చంపుకుందాం ?? ఒకవైపు కట్నం కోసం ఒకడు. మరో వైపు ఆడ పిల్ల అని తెలియగానే కడుపులో భ్రూణ హత్యలకు పాల్పడే వాడొకడు, సమయం దొరికితే పిచ్చి బూతు జోకులేసుకోడానికి అమ్మాయిల్ని సెక్స్ బొమ్మలుగా చూసేవాడొకడు...  ఇంకెప్పటి వరకురా ఇలా?? పని కై  బయటి కెళ్ళే అమ్మాయి వచ్చే వరకు నమ్మకం లేదు. బహిర్భూమి కై వెళ్లి అత్యాచారాలకు గురై చంపబడ్ వారిపట్ల న్యాయం లేదు. ఈ వ్యవస్థ మీద , కొన్ని సార్లు మానవజాతి మీద కూడా కోపం వస్తుంది. అనుమానమా ?? ఏనాడు పల్లెత్తు మాట మాట్లాడని ఆ పిల్లపై అంత దౌర్జన్యపూరిత హింసనా? కూతురు ఇంటికొస్తా అంటే కూడా వినని తల్లిదండ్రులు ఉండి ఏం లాభం రా. ?? పాములను చూపించి , పిచ్చి భయాలను కల్పించి  లొంగదీసుకొని వీడియోలు తీస్తున్నాబయటికి రాని నిజాల చీకట్లలో మగ్గే స్త్రీలు ఎందఱో . వాళ్లకు సంఘం , సమాజం ధైర్యం చెప్పడం కాదురా కుటుంబమే అండగా నిలబడడం లేదు. కుటుంభమే వారి మాట విననప్పుడు బయట ఏ కోన్ కిస్కా గొట్టం గాడెవడో ఎందుకు వింటాడ్రా?? ఎందుకు వింటాడు? అని చెంపపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ..  -'" అరేయ్ సతీష్ ఢిల్లీ లో మనం చూసిన అస్మిత థియేటర్ గ్రూప్ ని రేపే కాంటాక్ట్ చేద్దాం. పెద్ద మార్పు కోసం, ఈ సమాజ రుగ్మత బాగు చేసేందుకు  మన వంతు ప్రయత్నం మనం చేద్దాం .. వీధి నాటకాల ద్వారా జనాలను జాగృత పరుస్తున్న అస్మిత గ్రూప్ ని మనం ఇక్కడ ఫార్మ్ చేద్దాం . నేను ఇక అమెరికా వెళ్ళను ". అంటూనే తన కన్నీటిని తుడుచుకున్నాడు ఆకాశ్... ఎంత తుడుచుకున్నా కన్నీరు ఆగదే..

కన్నీళ్లు ఇంకా కళ్ళను ముంచెత్తుతూనే ఉన్నాయ్. మెళ్లిగా నడచి పిట్టగోడ దగ్గరకి వచ్చి నిల్చున్నాడు. కింద ఆడకుక్క వెంటపడుతూ భయపెడుతున్న మగకుక్కను చూసి పక్కనే ఉన్న రాయి తీసుకొని ఆ కుక్కపైకి విసిరాడు. ఆ వెనకే తన స్నేహితుల ముగ్గురి చేతులు తన భుజంపై పడ్డాయి మేమున్నాం అంటూ.

























Saturday, October 11, 2014

కథ శీర్షిక : సహజ
---------------------------------
ఇంత జరిగిందని తెలిసాక  వినయ్ తనని ఏలుకుంటాడ? అదే ప్రేమతో చూస్తాడా ? తనకంటే ముందు ఈ సమాజం, బంధువులు తనను స్వీకరిస్తారా ? తను పనిచేసే చోట, బయట, ఇరుగు పొరుగు వారికి తెలిస్తే  ఇక తన జీవితం వెక్కిరింతల పాలైన కథలా అందరినోట నానుతుంది కదా !?. ఇప్పుడెలా ??
-"అవును  ముగింపు , ఒకే ఒక ముగింపు కావాలి . దీనికి నేనే ఒక ముగింపు రాయాలి. కాలం తీరాక రాలిపోయే ఆకు ముగింపా ?? నది నుండి వేరై వేటగాడి గాలానికెళ్లి చిక్కుకునే ముగింపా ? రాత సరిగా రాయబడలేదని పుస్తకం నుంచి వేరు చేసే చిత్తుకాగితం ముగింపా ??..  "అనుకుంటూ ..

పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించిన తరువాత తన కధకి ఒక ముగింపు రచన చేసుకోవాలని నిర్ణయించుకుంది సహజ. వణుకుతున్న కాళ్ళు ఆగని కన్నీళ్లు. ఇలాంటి ముగింపు కారణమైన  దేవుణ్ణి మనసులో ప్రశ్నిస్తూ , బ్రద్దలవుతున్న గుండె, కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని దిగమింగుతూ తనతో తను ఎప్పుడూ మాట్లాడుకోనంత మాట్లాడుతుంది. ఒంటరిగా ఉండే కొందరిని చూసి ఒకప్పుడు ప్రశ్నించుకున్న తను ఇప్పుడు తనకు ఏకాంతం కావాలో ఒంటరితనం కావాలో, ఏ పరిస్థితుల్లో తను ఉందో  తేల్చుకోలేక నదికి అవతలా ఇవతలా వంతెనెలా కట్టుకోవాలో అని ఆలోచిస్తుంది.

 రాజీవ్ పరిస్థితి విషమం అని బాధపడాలో, లేక వినయ్ ప్రేమ కోల్పోయి భర్తకి పిల్లలకి దూరమవుతానేమో  నన్న భయం మీదకి దూకబోతున్న సింహలా కనిపిస్తుంటే , ఆ  బాధ తుఫానై  తనను ముంచేస్తుంటే, జీవితానికి పరిష్కారం ఇచ్చే స్థితిలో కాలం లేదని లోలోపలే శకలాల్లా విరిగిపోతూ నిస్సహాయలా ఆలోచనలతో కొట్టుకుపోతుంది  సహజ.

పిల్లల్ని స్కూల్ కి  సిద్ధం చేసి గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుని బాగా చదవాలని చెప్పి ఇద్దరినీ దగ్గరకు తీసుకుని కూర్చుని స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తుంది. స్కూల్ టైం అవ్తుండడం అయినా బస్సు రాకపోవడం చూసి పక్కనే ఉన్న సెల్ స్విచ్ ఆన్ చేసి బస్సు డ్రైవర్'కి  డయల్  చేసింది.

__" హలో గిరి నేను సహజ. రౌనక్  రియాల అమ్మని మాట్లాడుతున్నాను. ఇవ్వాళ స్కూల్ బస్సు రాలేదేంటి "?
___" మేడం గుడ్ మార్నింగ్. సర్ ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ఇవ్వాళ స్కూల్ కి రావడం లేదు. నువ్వు రానవసరం లేదని చెప్పారు "
___" అలాగా  సరే ".. అంటూ ఏదో సందిగ్ధతతో ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది .

పిల్లలు స్కూల్ కి రారని ఎందుకు వాళ్ళని ఇంట్లోనే ఉంచాలనుకున్నాడు ?. ఏమయ్యుంటుంది ?, విషయం ఏమైనా వినయ్ కి తెలిసిందా ? అని వినయ్ నంబర్ కి డయల్ చేసి తను రిసీవ్ చేసుకోనందుకు కోపంగా ఫోన్ పడేసింది.

                                                                *   *   *    *   *   *

_____" మమ్మీ మమ్మీ ఫోన్ అంటూ " దీర్ఘాలోచనలో ఉన్న సహజకు కూతురు ఫోన్  అందించింది.
_____" ఎవరు ?"
____" నేను సహజ వినయ్. ఏమయ్యింది ?ఫోన్ రిసీవ్ చేయడానికి ఇంత లేట్ చేశావ్ ?.ఇది ఆరవ సారి కాల్ చేయడం . అలా పరధ్యానంలో ఉంటే ఎలా ? సరేగాని తొందరగా రెడీ అయిఉండు. బయటికి వెళ్ళాలి. నేను ఓ గంటలో వస్తాను. " ఫోన్ పెట్టేసాడు వినయ్.

వినయ్ చెప్పినట్టుగానే ఏదో అలా తయారై పిల్లలు టీవీ పెడితే చూస్తుంది . చానెళ్ళు తిప్పుతున్న పిల్లల్ని మందలించే తను ఇవ్వాళ  అస్సలు ఏ లోకంలో ఉందో తనకే తెలియదు. ఇంతలో ఓ న్యూస్ చానెల్ లో
 __"చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ భగ్న ప్రేమికుడు అని తన జేబులో దొరికిన ఉత్తరం, దానితో పాటు తను రాజీవ్ కలిసి తీసుకున్న ఫోటో చూసి ఒక్కసారి కుప్పకూలిపోయింది . టీవీ ఆఫ్ చేసి తిరిగి ఆలోచనల్లో పడింది .
టీవీలో  వార్త గాని వినయ్ చూడలేదు కదా .. ? చూసుంటే ఎలా ? రెడీ అయిఉండమని ఎటు తీసుకెళతాడు ? తన మెదడులో, మనసులో రేగుతున్న అలజడి. ప్రశ్నలు సమ్మెట దెబ్బలేస్తున్నయి మెదడు చిట్లిపోయెంత నొప్పి. పెరుగుతున్న గుండె వేగం అంతా ఇంతా  కాదు. కాలింగ్ బెల్ మొగుతుంది .

_____" ఏంటి సహజ ఇంత  ఆలస్యంగానా తలుపు తీసేది ? సరే గాని రెడీ అయ్యావ్ గా పదా బయల్దేరుదాం ".
_____"ఎక్కడికి వినయ్ ?"
_____"పద ముందు చెబుతాను . పిల్లలూ ఇంట్లోనే ఉండండి . పనమ్మాయి వాచ్ మెన్ ఇక్కడే ఉంటారు. నేను మమ్మీ బయటికి వెళ్తున్నాం . సరేనా ?"
____"రా సహజ " అని తన ఎడమ చేతిని పట్టుకుని ఇంటి నుంచి బయటికి నడుస్తున్నాడు . అచ్చంగా తన పెళ్లిరోజు కళ్ళముందు కనిపిస్తుంది సహజకి . అలాగే వణుకుతున్న కాళ్ళతో, చెమటలు పడుతున్న చేతులను తుడుచుకుంటూ కార్లో కూర్చుంది సహజ .

__" ఎటు వెళ్తున్నాం "
___" నీకే తెలుస్తుంది  కొంచెం ఓపిక పట్టు సహజ "
____"నీతో ఒక విషయం చెప్పాలి వినయ్"
___"ఇప్పుడొద్దు సహజ ఇంటికెళ్ళాక చెప్పుదూలే "
ఆ మాట విని ఆగిపోయింది సహజ . ఇక ఏం  మాట్లాడగలదు ?

అదే ముందటి సహజ అయితే గోల పెట్టుకునైనా, గొడవ పెట్టుకునైనా తన పంతం నెగ్గించుకునేది . సమంగా సంపాదించగలనన్న అతిశయోక్తి లోలోపల. కాని ఇప్పుడు అలా చేయలేదు .
'నిజమే కదా అపరాధబావం మనిషిని మూలాల్లోంచి పెకిలించేస్తుంది . మనసును త్రవ్వుతూ హృదయాన్ని స్వాదీనం చెసుకుని ఎవరిని వారికే కాకుండా చేస్తుంది .'

కారు సోమాజిగుడా  వైపుగా  వెళ్తుంది . ఆఫీస్ కేమైనా తీసుకెళ్తున్నాడా ? సహజ హృదయంలో ప్రశ్నల శరాలు. తట్టుకోలేక , మాట్లాడలేక , బయటికి ఏడ్వలేక తదేకంగా కార్ కిటికీలోంచి బయటికి చూస్తుండి పోయింది . కార్ డ్రైవ్ చేస్తూ వినయ్ కూడా నిన్నటి విషయాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటున్నాడు .

                                             *   *     *     *     *     *    *   *   *  *

నిన్న సాయంత్రం ఆరున్నర :

తన కళ్ళు నాకెప్పుడు అబద్ధం చెప్పవు . పెళ్ళయ్యింది మొదలు ఆనందం, దుఃఖo, ప్రేమ, అనుమానం  లాంటి ఎన్నో భావాలు , ఎప్పటికప్పుడు చూపుల రాతలతో నాహృదయంతో మాట్లాడేది. ఏది దాచుకోలేక పోయేది . ఏంటో ఏడ్చి వచ్చినట్టుంది . ఆఫీస్ లో అంత సజావుగానే సాగిఉంటుందా ? టీం మానేజరుతో ఈ మధ్య పడడంలేదు అంది ఏమయ్యుంటుందో ?
___"సహజ .. సహజ . !! ఎంత సేపు వాష్ రూంలో కాఫీకలిపాను చల్లారిపోతుంది త్వరగా రా "
___" వస్తున్నాను వినయ్"

పెళ్ళయిన కొత్తలో మొగుడు హోదా అడుగుతాడేమోనని'' ఏవండీ '' అని పిలిచేది కాని వినయ్ ఎంతో పరిణతి చెందినవాడు . తనను స్నేహితునిలా భావించి మెసలమని ప్రోత్సహించాడు. అందుకే తనని వినయ్ అని విన్నూ అని పిలుస్తుంది సహజ. వినయ్ పరిణతితో పాటు ఆలోచనా పరంగా, మానసికంగా , మానవత్వం స్వేఛ్చ పట్ల ఖచ్చితమైన అభిప్రయాలు కలవాడు. స్టూడెంట్లా ఉంటూనే ఎన్నో సామాజిక సంస్థలతో అనుబంధం కలిగి ఉండి పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వాలంటీర్ గా ట్రైనర్ గా పని చేసాడు. ఆ అంశాలే తనను సమాజంలోని అనేకమైన విషయాలపై అవగాహన పెంచుకునేలా చేసాయి. ప్రతి అంశాన్ని పరిశీలనాత్మకంగా చూసే మనిషి . సహజ అప్పుడప్పుడు దూకుడుగా తనను దూషించినా ఓర్చుకునే వాడు. తను డిగ్రీకి రావడంతోనే తండ్రి చనిపోతే ఇద్దరు చెల్లెళ్ళను చదివించి తండ్రి సంపాదించిన ఆస్థులమ్మి వారికి పెళ్లి చేసాడు. తనకోసం ఏమి ఉంచుకోలేదు . తల్లి కూడా ముగ్గురి దగ్గర కొన్ని కొన్ని నెలలు ఉంటూ జీవితాన్ని గడుపుతుంది. అయినా ఏదో అసంతృప్తి సహజలో అంత మంచి భర్తను చేసుకున్నందుకు సంభరపడాలో లేక అతి మంచితనం గల వ్యక్తని బాధపడాలో తనకు అర్ధం కాక వినయ్ పై చిరాకు పడేది. అప్పుడప్పుడు పండగలకు ఇంటికొచ్చిన ఆడపడుచుల ముందు కూడా చులకనగా మాట్లాడినా వినయ్ మాత్రం సహజను ఎవ్వరి ముందు విమర్శించలేదు. కుటుంబం గురించి భాద్యతల గురించి పిల్లల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ? లేదా అంటూ దెప్పి పొడిచేది. ఆస్తినంత అమ్మి తనకేమి మిగిల్చుకోలేదని కోపం. MBA  చదివి తరువాత తనకున్న ఆసక్తి మేరకు MA సోషియాలజి చేసి ఒక మంచి MNC లో CSR  హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు డెబ్బై వేల వరకు సంపాదిస్తున్నాడు . సహజ కూడా ఒక మంచి కంపెనీలో HR  మానేజరు గా చేస్తుంది. రియా రౌనాక్ లను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిస్తున్నారు . నాలుగేళ్ల క్రితమే ఇద్దరి ఆఫీసులకి దగ్గరగా ఉంటుందని అమీర్పేట్ లోని ఒక అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్ తీసుకున్నారు. అంతా సజావుగానే సాగిపోతుంది .

ఏం జరిగిందో ఎప్పుడూ  కనిపించని దిగులు భయం సహజ కళ్ళను చిలుకుతూ ఎరుపు చేస్తూ నీళ్ళను ఉబికిస్తున్నాయి. ప్రక్కనే కూర్చుని కాఫీ తాగుతున్నా ఎప్పటిలా ఆఫీసు విషయాలు తనతో మాట్లాడే సహజ ఈ పదేళ్లల్లో ఎప్పుడూ లేనంత దిగులుగా కనిపిస్తుంది. మౌనం వారిరువురి మధ్య ఏదో కొత్త సంఘటనకి తెర లేపబోతున్నట్టు సూచిస్తుంది.

                                          *   *    *   *   *   *   *   *   *  *   *   *
సమయం రాత్రి 9 దాటుతుంది  :

__"సహజ ఎందుకలా ఉన్నావ్ ?? సాయంత్రమే నిన్నడగాల్సింది . ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావని డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదు. ఇప్పుడైనా చెప్తావా ? అంటూ అడిగాడు వినయ్. సహజ నుదుటిపై చేయిపెట్టి జ్వరం ఏమైనా ఉందా ?అని పరీక్షగా చూస్తూ .. "
వినయ్  చేయి  సహజ నుదురు తాకగానే ఒక్కసారి ఉలిక్కిపడి  లేచి కూచుంది సహజ.

___"ఏమయ్యిందిరా ? ఎందుకింత నీరసంగా  ఉన్నావ్ ? నాతో  షేర్ చేసుకోవచ్చుకదా కొంచెం కుదుటపడతావ్ ". అంటూ తనను దగ్గరిగా తీసుకున్న వినయ్ భుజంపై తలవాల్చి అలాగే ఏడుస్తూ ఉండిపోయింది కాసేపు .
__" సరే భోజనం తీసుకొస్తాను. ఇక్కడే తిందువు గాని" అంటూ  వినయ్ భోజనం తేవడానికి బెడ్ రూం నుంచి బయటికి నడిచాడు . మంచం మీది నుంచి లేచి అద్దంలో ముఖం చూసుకుంటూ చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ ఆలోచనలో పడింది సహజ .

__" జరిగిందేదో జరిగిపోయింది. ఇలాగే ఉంటె వినయ్  దృష్టిలో నేను నేరస్తురాలిగా మిగిలిపోయి ఇక తన ప్రేమ పొందుకోలేను. నా భావోద్వేగాలను బాధను అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి జీవితాన్ని పోగొట్టుకున్నాను. అయిందేదో అయ్యింది  జీవితం దిద్దుకోమని నన్ను చేర్చుకొని అవకాశం ఇచ్చింది కాలం. నేను నా కుటుంభం నా పిల్లలు  నాకు ముఖ్యం . గతం పిలిచినా ప్రస్థుతాన్ని వదిలి వెనక్కి వెళ్లి నాకు నేను మోసాన్ని బహుమతిగా ఇచ్చుకోలేనుగా. అంతటి మూర్ఖురాలిని కాలేను కాని ఈ విషయం వినయ్ కి తెలిస్తే ? నన్ను ఇప్పుడెంత ప్రేమగా చూసుకుంటున్నాడో అంతే  ప్రేమగా ఆదరించగలడా ?ఎన్ని మాటలన్నా విసిగించినా ఓర్చుకున్న  మంచి మనిషి గతం చేసిన గాయాల్ని చిరాకుగా అతనిపై ప్రదర్శించినా ఏనాడు నోరెత్తి పల్లెత్తు మాట  అనని వ్యక్తి. నా స్వాతంత్ర్యాన్ని స్వేచ్చ్చని గౌరవించి ఏనాడు నా భావాలు దెబ్బతీయని వ్యక్తిత్వం గల నా భర్త వినయ్  ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా ?" అని ఆలోచిస్తూ ..... తన ఆలోచనలతో తనే విభేదిస్తుంది అప్పటికప్పుడే __" అవునులే ఏ భర్త జీర్ణించుకోగలడు? తన భార్యకు ఇలాంటి గతం ఉందంటే ? వినయ్ కూడా' మగ '' వాడే కదా !. అంటూ భయం, ఆలోచనలు తనపై చేస్తున్న దాడిని ఏడుస్తూనే ఎదుర్కొంటూ వెళ్లి పిల్లల ప్రక్కనే పడుకునిపోయింది సహజ .

__"సహజ ... సహజ ఎక్కడా ?? అంటూ తన గదిలో లేని సహజను పిల్లల గదిలో వాళ్ళను హత్తుకొని పడుకోవడం చూసి వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రకు ఉపక్రమించాడు వినయ్.

ఎప్పటిలాగే పెద్ద మోత పెడుతూ అలారం అరుస్తుంటే దాని తలపై ఒకటి మొత్తి సగం మూసుకున్న కళ్ళతో వాష్ రూం కెళ్ళి  మొహం కడుక్కుని బయటికెళ్ళి పాల ప్యాకెట్ల తో పాటు అక్కడే ఉన్న న్యూస్ పేపరు తీసుకొని లోపలికొచ్చాడు వినయ్. సహజ ఇంకా నిద్రనుంచి లేచినట్టు లేదని తనే కాఫీ కలుపుకుని ఆ రోజుటి పేపరు తిప్పుతూ ఒక్కసారి కాఫీ కప్పు పక్కకు పెట్టి, ఆ వార్త పత్రికలోని వార్తను మరోసారి తీక్షణంగా చదువుతున్నాడు. అతని హృదయం వేగంగా కొట్టుకుంది. కళ్ళు ఎరుపెక్కాయి. గుండెను గట్టిగా పట్టుకుని మెలిపెడుతున్నట్టు  ఏదో బాధ. కొద్దిసేపటికి తేరుకొని తయారై సహజను పిల్లల్ని నిద్ర లేపకుండానే కారు తీసుకొని బయలు దేరాడు.

అలా నిన్నటి నుండి ఇవాల్టి వరకు జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదులుతుంటే కారు డ్రైవ్ చేస్తున్నాడు వినయ్ . ప్రక్కనే దిగులుగా ఉన్న సహజవైపు చూస్తే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది. తనని కదపలేదు పిలవలేదు. తదేకంగా కారు లోంచి బయటికి చూస్తుంది. సహజకు  నిన్న జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు ఒక్కొక్కటిగా కనబడి బయపెడుతున్నట్టున్నాయి.

                                              *   *   *   *   *   *   *   *   *  *  *  *  *

నిన్న సహజ  ఆఫీస్ అయిపోయిన తరువాత :

తన కార్ పార్క్ చేసిన స్థలం  వైపుకు బయల్దేరింది సహజ . ఒక్కసారి అమాంతంగా పరుగెత్తుకుని వచ్చి సహజ కాళ్ళు పట్టుకున్నాడు రాజీవ్ బిగ్గరగా ఏడుస్తూ . పాతబడ్డ బట్టలు, మాసిపోయిన జుట్టుతో పోల్చుకోలేకుండా తయారైయ్యాడు.

___"ఎదురుచూస్తున్నా చచ్చిపోతున్నా, నిన్ను చూడకుండా  ఉండలేను. " ఏడుస్తూ చేతులు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఒక్కసారి రాజీవ్ని అలా చూడగానే సహజ నిర్ఘాంతపోయింది . ఉన్నపళాన  చీకటంతా వలగా మారి తనను కమ్మేసిందా అన్నట్టు వణికిపోయింది.

 ___" వదులు రాజీవ్. పదేళ్ళ క్రితం నేను నీ గురించి చాలానే ఏడ్చాను. నువ్వు రాలేదు. ఎదురు చూసేంత ఓపిక నాకు ఉన్నా. మా ఇంట్లో వాళ్ళకి లేదు. అందుకే పెళ్లి చేశారు. మనసు నీ దగ్గరే ఉండిపోయినా మరో పెళ్లి చేసుకుని నేను అనుభవించిన నరకం అంతాఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తితో జీవితం పంచుకోవాల్సి వస్తే కలిగే బాధ అనుభవిస్తున్న ఆ స్త్రీకే తెలుసు. ఇప్పుడు నాకు పెళ్ళయి పదేళ్ళు. ఏ  ధైర్యంతో ఇలా అడుగుతున్నావ్? అనుమానంతో లేని సంబంధాన్ని అంటగట్టి, ఏమైపోతానో అని కూడా  ఆలోచించకుండా వదిలి  వెళ్ళిపోయాక ఇప్పుడు, నీ విలువ తెలిసింది నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను అంటే ఎలా వచ్చేది ? " అని మాట్లాడుతుండగానే ..
___" సహజ .. సహజ ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకు అంటూ గట్టిగా ఏడుస్తూ "
తన చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్న రాజీవ్ని దూరంగా నెట్టి -" పిచ్చిగా మాట్లాడకు రాజీవ్ నన్ను వదిలేయ్" కార్ తీసుకొని బయలు దేరింది సహజ.

కార్ వెనకే పరుగెత్తి వస్తున్న రాజీవ్. ఇంతలో ఏం  జరిగిందో పెద్ద శబ్ధం  కారు అద్దంలోంచి గుంపులు గుంపులుగా పరుగెడుతున్న జనాన్ని చూసి గట్టిగా ఏడుస్తూ ఇంటికి బయలు దేరింది . ఆ కన్నీటికి ఇప్పటి వరకు విరామమే లేదు . ఇంతలో
__"సహజ  దిగు  వచ్చేశాం  " అని కారు డోర్  తీసాడు వినయ్ .

                                        *    *     *      *     *     *     *    *   *     *     *     *

స్థలం - యశోదా హాస్పిటల్ సోమాజిగూడ :

కారు దిగిన సహజకి ఒక్కసారి గుండె ఆగిపోయినంతపనైయ్యింది. తన జీవితంలో ఏ రోజైతే రాకూడదని అనుకుందో అదే రోజు వచ్చిముందు నిల్చుంది. తన స్థితి గమనించిన వినయ్ గట్టిగా ఆమె చేతిని పట్టుకుని లోనికి నడుస్తున్నాడు. తన భర్తకు విషయం తెలిసిపోయింది. ఇక జరుగబోయే పరిణామాలేంటో అని భయం భయంగా అడుగులు వేయలేక వినయ్ వెనకే నడుస్తుంది. అయితే ఉదయమే వినయ్ హాస్పిటల్ కొచ్చాడని నిర్ధారణ చేసుకుంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆపలేని దుఃఖాన్ని చీరకొంగు వెనక కప్పి పెట్టే  ప్రయత్నం చేస్తుంది .

ఇద్దరూ  అలా రాజీవ్ని ఉంచిన ICU  వైపు నడిచారు. భయంకరమైన స్థితిలో ఇక చచ్చిపోతాడో బ్రతుకుతాడో తెలియని పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న్డాడు రాజీవ్. బోరుమంటూ ఏడవాలనుంది సహజకు కాని ఏం  చేయగలదు? కళ్ళు కన్నీళ్లు ఒకటయ్యాయి . భర్తవైపు చూసింది. వినయ్ కళ్ళలో అదే ప్రశాంతత . అదే ప్రేమ కొంచెం కూడా మార్పు లేదు.

___"సహజ ఇక్కడే ఉండు నేను డాక్టర్ని కలసి వస్తాను '
__"వద్దు వినయ్ .. ప్లీజ్ ఇక్కడే ఉండు.  నా చేయి వదిలి వెళ్ళద్దు . నాకు భయంగా ఉంది " అంటూ ఏడుస్తూ సహజ.
___" ఎటూ వెళ్ళట్లేదు డాక్టర్ని కలిసొస్తాను. ధైర్యంగా ఉండు". అంటూ బయటికెల్లాడు వినయ్ .

 ICU లోకి వెళ్ళే పర్మిషన్ లేకపోయినా లోపలికెళ్ళి  రాజీవ్ ని అలా చూస్తూ చలించిపోయింది సహజ. పదేళ్ళు వెనక్కెళ్ళి ఒక్కసారి ఆ గతం , ఆ ప్రేమ , ఆ  మనిషిని గుర్తుచేస్తుకుంటూ ..
__" రాజీవ్.....  రాజీవ్  ఒక్కసారి కళ్ళుతెరువు. ఒక్కసారి నను చూడు అంటూ ఏడుస్తూ తన కుడి చేతితో అతని పట్టుకుని ఏడ్చింది.

"సహజ చేయి తగులుతూనే, ఆమె స్వరం వింటూనే ఏదో స్పృహ రాజీవ్ శరీరంలోకి ప్రవహించింది. ఈ లోపు వినయ్ డాక్టర్ని తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్ ఏవో పరీక్షలు చేసి రాజీవ్ ఆరోగ్యం కుదుట పడిందని, ఇక ఏ భయం అవసరంలేదని చెప్పి వెళ్ళాడు .

                                                *  *   *   *    *   *   *   *    *   *   *   *
ఇద్దరూ  సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు . ఇప్పుడు సహజ వినయ్ లో ఓదారుస్తున్న ఒక మంచి స్నేహితున్ని చూస్తుంది. బాధను పంచుకుంటూ అండగా నిలబడ్డ తండ్రిని చూసుకుంటుంది. ఆ పరిస్థితుల్లో వేరే మొగాడైతే తనను స్వీకరించి ఉండేవాడా ? అని ఆలోచిస్తూ  కన్నీళ్లు కారుస్తుంది.

వినయ్ ఆమె  కన్నీళ్లు తుడుస్తూ పిచ్చి సహజ ' ఐ లవ్ యు రా " అని గట్టిగా తన కుడి చేయి పట్టుకున్నాడు. జీవితంలో ఇంతకు మించి ఏం ఆశిస్తుంది ఒక స్త్రీ. ఇంతగా అర్ధం చేసుకునే భర్త దొరకటం తన అదృష్టమే కదా అనుకుంటూ లోలోపల తను కొలిచే దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంది. నిజమైన ప్రేమ ఇంత విలువైనదిగా ఉంటుందా ?! అని అనుభవపూర్వకంగా తెలుసుకుని తన భర్తను  ఆ ప్రేమకు ప్రతి రూపమే అనుకుంటూ మళ్ళీ కొత్తగా చిగురిస్తున్న ప్రేమను అనుభూతిచెందింది.


ఈ లోపు రాజీవ్ బంధువులొచ్చారు. తన పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది కాబట్టి స్వస్థలానికి తీసుకెళ్ళి అక్కడే వైద్యం చేయించుకుంటామని డాక్టర్ తో మాట్లాడారు . రాజీవ్ ని వాళ్ళు అంబులెన్సు లో తీసుకొని బయలుదేరారు . వినయ్ సహజలు హాస్పిటల్  నుంచి బయటికొచ్చి ఇంటికి బయల్దేరారు. మార్గం అంతా  ప్రయాణంలో ఒక్క మాట మాట్లాడలేదు సహజ. ఇంటికెళ్ళాక కూడా వినయ్ ఇలాగే ఉంటాడా ? అని నిజమైన ప్రేమకు  నిర్వచనాలెతుక్కుంటూ లోతుగా అన్వేషిస్తూ కాలాన్ని లెక్కబెడుతూ  ఆలోచనల్లో అలాగే ఉండిపోయింది. .

                                                 *  *   *   *   *    *   *  *   *
అపార్ట్మెంట్ సెల్లార్ లో కార్ పార్క్ చేసి ఫ్లాట్ వైపు నడుస్తుండగా సహజ ఒక్క సారి కళ్ళు తిరిగి కింద పడబోయింది. రెండు చేతుల్లో అలా తనను ఎత్తుకొని ఫ్లాట్ వైపు నడిచాడు వినయ్. నడుస్తున్నంత సేపు ఇద్దరి కళ్ళు ఒకరి హృదయాన్ని ఒకరి ముందు ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పుడు సహజ కళ్ళు మళ్ళీ అంతే స్పష్టంగా స్వచ్చంగా ప్ర్రేమగా లాలానగా ఆప్యాయంగా వినయ్ ని చూస్తున్నాయి. వినయ్  ప్రేమ  పొందడం ఎన్ని జన్మల పుణ్యమో అని మరో జన్మంటూ వుంటే అప్పుడు కూడా తననే భర్తగా ఇవ్వమని భగవంతుని కోరుతూ, తనలోని మార్పులకు పరివర్తనకు తలుపులు తెరిచింది.

సహజను అలా ఎత్తుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు వినయ్. అది చూసి పిల్లల్లిద్దరు ముసి ముసి నవ్వులు నవ్వు కుంటుంటే కాలిగ్ బెల్ మోగింది . వినయ్ తలుపు వైపు నడుస్తుంటే సహజ పిల్లలనిద్దరిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది.

__" థాంక్ యు " అని చెప్పి తలుపులు వేసి లిపలికొచ్చాడు వినయ్. సహజకి ఇష్టమైన పూలబొకేతో ... ఆ పూల బోకే సహజకి ఇస్తూ  మరో సారి " ఐ లవ్ యు " అంటూ సహజ కుడిచేతిని పట్టుకుంటే పిల్లలిద్దరూ చప్పట్లు కొడుతూ అల్లరి చేస్తుంటే, కన్నీళ్లిప్పుడు  ఆనందంతో కలిసి అతిథులుగా వచ్చాయి. సహజకిప్పుడు నిజమైన ప్రేమకి నిర్వచనం కూడా దొరికింది .
                                 
                                         ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Monday, January 21, 2013

ఇది నిజం సందేహపడొద్దు (by mercy margaret)
-------------------------------------
యాత్రికుని లా వచ్చి ఒక వ్యక్తి  ఎడారిలో తప్పిపోయాడు . ఉదయం నుండి ఆ ఎడారిలో నాలుక అంగిలికి అంటుకు పోతుంటే  ఎటు వెళ్ళాలో తెలియక అల్లల్లాడుతూ తిరిగుతూనే ఉన్నాడు.సూర్యుడు తన పని తాను చేసుకుపోతున్నట్టు నడి నెత్తిపైకి ఎక్కి ,మిట్ట మధ్యాహ్నం ఇలా ఉంటుందని చూపిస్తున్నాడు .గొంతు ఎండిపోతుంది గుక్క నీటి కోసం వెతుకుతూ ఆ ఎడారిలో నడవలేక భారంగా నడుస్తూ జీవితపు చివరి క్షణాలా అన్నట్టున్న సమయాన్ని అడుగులతో లెక్కించుకుంటున్నాడు .
ఇలా దాహంతో అల్లల్లాడుతూ దారి తప్పిపోయి ఎడారిలో తిరుగుతున్న తనకి దూరంగా పాడైపోయి , బాగు చేస్తూ వదిలేసినట్టున్న బోరింగు (తొలుపుడు యంత్రం /బోరు )కనిపించింది .నాలుకను లాగి నరనరాలకు దాహం ,చావు రుచి చూపిస్తున్న ఎండలో పడుతూ లేస్తూ మొత్తానికి ఏదోలా ఆ బోరు వరకు చేరుకున్నాడు ఆ వ్యక్తి .అక్కడ చిన్న జగ్గులో నీళ్లతో పాటు బోరింగుపైన ఇలా రాసి ఉంది.-" ఈ జగ్గు లోని నీళ్ళు ఈ బోరింగులోకి ఒంపి మెళ్లిగా కొడుతూ ఉండండి కావాల్సినన్ని నీళ్ళోస్తాయి" అని -
ఆ మాటలు చదివి ఆలోచనల్లో పడిపోయాడు ఆ వ్యక్తి .
-నీళ్ళు ఆ బోరు పంపులో ఒంపి  నీళ్ళు వచ్చే వరకు ఆగి ఆ బోరు కొట్టడమా ?
-ఒకవేళ అందులో నీళ్ళు పోస్తే ఆ మాటలు నిజం కాక నీళ్ళు రాక పోతే ?
-ఈ ఆలోచనలెందుకు ఆ జగ్గులో ఉన్న నీళ్ళు తాగితే ఆ కొన్ని నీళ్ళు అప్పటికప్పుడు దాహం తీర్చుకోవడం తప్ప ఆ తరువాత మళ్ళీ దారివెతుకుతూ వెళ్లి ఇలాగే నీళ్ళు లేకుండా చస్తే  ?
ఈ ఆలోచనల్లో ఏ నిర్ణయం తీసుకోవాల్లో తెలియక ఊగిసలాడుతూనే .ఈ నీళ్ళు తాగి వెళిపోతే సరి కదా మధ్యలో ఎవరో ఒకరు దారి చెబుతారు అనుకున్నాడు .కాని ఎవరూ  ఎదురవక ఇలాంటి పరిస్థితే రేపు కూడా ఎదురయితే ఏంటి పరిస్థితి అనుకుని మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాడు .ఏదైతే అది జరుగుతుంది ఈ బోరు మీద రాసిన మాటలు నమ్ముతున్నాను అని ఆ జగ్గులోని నీళ్ళు ఆ బోరు పంపులో ఒంపి  మెళ్లిగా  ఆ పంపు కొట్టడం ప్రారంభించాడు .మొదటి అర్ధగంట వరకు కొడుతూనే ఉన్నాడు అయినా నీళ్ళు రాలేదు .భయం భయం, చచ్చిపోయే సమయం వచ్చినట్టే ఉంది ఐనా  ఆ కొన్ని నీళ్ళు తాగి వెళిపోతే బాగుండేది కదా నా పిచ్చి కాకపొతే అనుకుని  తనని తానూ తిట్టుకుంటున్నాడు . మళ్ళీ బోరు కొట్టడం ప్రారంబించాడు.కొద్ది సేపటికి నీళ్ళు రావడం మొదలయ్యాయి .అక్కడ రాసి ఉన్నట్టే సమృద్దిగా వచ్చాయి.  కావలసినన్నినీళ్ళు త్రాగాడు. బాటిల్ నింపుకున్నాడు.ఒళ్ళు కడుకున్నాడు. సంతోషం వేసింది ఆ మాటల్ని నమ్మినందుకు .సందేహం భయపెట్టినా కార్యాన్ని మధ్యలో వదిలి పెట్టనందుకు తనని తానూ అభినందించుకుని దేవునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.ఆ జగ్గు మీద రాసున్న మాటలు "-మీరు ఆ బోరులో ఈ నీటిని పోసిన తరువాత ,వచ్చిన నీళ్ళు తాగి వెళ్ళేప్పుడు మళ్ళీ ఈ జగ్గు నింపి పెట్టండి అని." ఆ చుట్టు  పక్కన వెతికి దొరకిన సుద్ధ ముక్కతో ఆ బోరింగు మీద ఇప్పుడు ఈ వ్యక్తి  ఇలా రాసి బయలు దేరాడు -" ఇక్కడ రాసి ఉన్న మాటలను నమ్మండి , ఇది నిజం సందేహపడొద్దు ".

Saturday, January 12, 2013



" తాపసి  "( by mercy margaret) 
------------------------------------------
అది చలి కాలం .పక్షులు వలస వెళ్ళే సమయం .ముందుకు వెనక్కు ,రెక్కలూపుకుంటూ ప్రయాణించే పక్షుల గుంపు . చీకట్లో ,  అదీ మబ్బుల్లో అలలు అలలుగా  ప్రయాణిస్తున్నప్పుడు వాటికి కనిపించేదంత మైళ్ళ ప్రయాణం అందులోను ఏ విడిదికో విహారయాత్రకు వెళుతున్నప్పుడు పిల్లలు పడే ఆనందంలాంటి ఆనందం .సూర్యాస్తమయం ఎప్పుడవుతుందా ? అని చూసి ఒక గంట వాటిని వీటిని కేకలేసుని మరీ బయల్దేరాయి అవి కూడా ..   బిట్టు (ఆ వలసేల్లె పక్షుల్లో వయసులో అందరికన్నా చిన్నది ,ఇదే మొదటి సారి కూడా వలస ప్రయాణం చేయడం దానికి ) వాళ్ళ స్నేహితులందరూ ఒక గుంపుగా ముందే వెళ్ళిపోయారు . బిట్టు కన్నా ముందే ఒక సారి వలసెల్లిన తన స్నేహితులు ఆ విశేషాలు చెప్తుంటే ,ఎంత ఆసక్తితో వింతలన్నీటిని గురించి  విన్నదో .ఇప్పుడు కుటుంబంతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యింది .

ప్రయాణం తో పాటు  బిట్టు ప్రశ్నల ప్రస్థానం కూడా మొదలైయ్యింది . తెలుసుకోవాలనే తపనెక్కువ . కొత్త విషయాల మీద ఆసక్తి ఎక్కువ .ఎప్పుడు అల్లరిగా చిలిపిగా ,స్వేచ్చగా ఆకాశంలో పల్టీలు కొడుతూ తిరగడం అంటే ఎంతిష్టమో బిట్టుకి .రెక్కలొచ్చి ఎగరడం నేర్పడానికి బిట్టు వాళ్ళ అమ్మకి ఎక్కువ సమయం కూడా పట్టలేదు ,దీన్ని బట్టి అర్ధం చేస్కోవచ్చు బిట్టు ఎంత పట్టుదలున్న పక్షో . బిట్టు అడిగే ప్రశ్నలకు వాళ్ళ తాతగారే సమాధానాలు చెప్పే గురువు . కొంచెం ముందుగా ఎగురుతూ తాత పక్కకు చేరి 
- " తాత  మనం ఉదయం  ప్రయాణం చేయొచ్చుగా రాత్రిపూటే ఎందుకు వెళ్ళడం " ?అని అడిగింది 
- " ప్రయాణానికి రాత్రి పూటను ఎంచుకోవటానికి ప్రధానకారణం మన  శత్రువుల నుండి తప్పించుకోవటం అందుకే రాత్రి ప్రయాణమే శ్రేయస్కరం. మన పక్షుల్లో జీర్ణశక్తి అపారం. అతి తర్వగా జీర్ణం అవుతుంది. దూర ప్రయాణానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవటానికి తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోగలగటం. క్రొవ్వురూపేణ నిల్వచేసుకుంటాం . రాత్రి ప్రయాణం వలన ఎంతో వెసులుబాటు కూడా ఉంది. దీనితో పగలంతా ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవటానికి వీలవుతుంది. రాత్రివేళ ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండటంతో మనం కావలసిన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు శ్వాసక్రియ ద్వారా గాలి తిత్తులనుండి మనం నీటిని కోల్పోతాము . ఇలా నీటిని కోల్పోవటమే ప్రధానం గా ఏ పక్షైనా ఆగకుండా ఎంత దూరం పోగలదన్నది నిర్ణయిస్తుంది. " అని సామధానం చెప్పాడు  బిట్టు వాళ్ళ తాత .
- "ఓహో అలాగా " ..అంటూ ఎదో కొత్త విషయం నేర్చుకున్నట్టు సంబరపడుతూ మళ్ళీ దాని వరుసలో కెళ్ళి ఎగరడం మొదలుపెట్టింది బిట్టు .

మళ్ళీ ఇంకా ఏదో  గుర్తొచ్చి అడగడానికి ఎగురుతూ వెళ్లి మళ్ళీ తాత పక్కకు చేరింది .మళ్ళీ ఇంకో ప్రశ్నతో రాగానే బిట్టు వాళ్ళ తాతకు నవ్వుతో పాటు  కొంచెం అనాసక్తత కూడా  వచ్చినా రెండింటిని ప్రదర్శించకుండా ..
- " బిట్టు నీ ప్రశ్నలన్నీ టక టకా ఒక్కసారే అడిగేయ్ అంటూ " రెక్కల్లో వేగాన్ని తగ్గించుకుని బిట్టువైపు చూసాడు .
- " సరే గాని తాత .. మనం ఎందుకు వలసెళ్ళాలి ?? ఇలా ఎంత దూరం ప్రయాణించాలి ?? మనం వెళ్ళేది  సరి అయిన మార్గమే అని నీకెలా గుర్తుంటుంది ? "  అని అడగాల్సినవన్నీ కుతూహలం ఆపుకోలేక అడిగేసింది బిట్టు ..
- " అడగాల్సినవన్నీ అడిగావుగా అయితే విను  ...కష్టకాలంలో ఆహారం దొరకక ఆహారాన్వేషణలో వలసపోవటం జరుగుతుంది. వసంతకాలంలో జంట కట్టడానికి, గుడ్లు పెట్టి పిల్లల్ని పెంచటం కోసం కూడా  మన పక్షులం  వలస పోతాము . శీతాకాలపు తీవ్రత నుండి బయటపడటానికి వెచ్చని ప్రదేశాలను వెదుక్కుంటూ వలసపోతాము . ఏటవాలుగా పయనించే సూర్యకిరణాలు, శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు ప్రయాణానికి పచ్చజెండా ఊపుతాయి. అంతేగాక వాతావరణంలో వచ్చే మార్పులు ప్రధానంగా వలసకు దారి తీస్తాయి. ప్రయాణానికి సరిపడినంత కొవ్వు నిల్వ చేసుకుని మరీ బయల్దేరుతాము బిట్టు .
ఇక ఎంత దూరం  ప్రయాణిస్తామంటే .. మనం  90 గంటల వరకూ ఆగకుండా ప్రయాణించగలము . ఇందుకు గంటకు కేవలం అరగ్రాములోపు కొవ్వును ఖర్చుచేస్తే చాలు. ఆర్కిటిక్ టెర్న్ పక్షులు అన్నింటికంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి. ఇవి ఆకు రాలు కాలంలో ఉత్తర ధృవం నుండి బయలుదేరి దక్షిణ ధృవానికి చేరుకుని వసంతం వచ్చేసరికి తిరిగి ఉత్తర ధృవానికి వలస పోతాయి బిట్టు అని చెప్తూ 
బిట్టు మనం సాధారణంగా గాలివాలుకు అనుగుణంగా పయనించాలీ . సముద్రాల మీద పయనించేటప్పుడు కొన్నిసార్లు తుఫానుల్లో, సుడిగాలుల్లో చిక్కుకుని చాలా మంది మన బంధువులు చనిపోయారు  . భూమి పైన ఎగిరేటప్పుడు ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణాన్ని వాయిదా  వేసుకుని ఆహారం సేకరించుకుని, సేద తీర్చుకుంటూ ప్రయాణం సాగించాలి గుర్తుంచుకో " అని చెప్పాల్సిన , పంచాల్సిన  జ్ఞానం అనుభవం అంతా పంచి ఇక పద వేగాన్ని రెట్టించు అని బిట్టుని ప్రోత్సాహ పరుస్తూ  వేగాన్ని రెట్టించాడు బిట్టు తాత ఆ గుంపు పక్షుల  నాయకుడు .
ఎన్ని ఆసక్తికరమైన విషయాలో తెలుసుకుని సంతోషంతో ఆ చలిని రెక్కలకింద టప  తప లాడిస్తూ వలస ప్రయాణాన్ని ఆహ్లాదంతో అనుభవిస్తుంది బిట్టు . ఆ రోజు పౌర్ణమి . చంద్రుని వెన్నలను , తారల తళుకులను ,పొగ మంచు పోగులను మెత్తగా స్పృశిస్తూన్న అనుభవం బిట్టుకి .కొండలు లోయలు అడవులు కొలనులు అన్నిటిని గురించి ఎలా విన్నదో అలాగే  కనిపిస్తున్నాయి తనకి . మధ్య  మధ్యలో  పూల పరిమళాలను మోసుకొస్తున్న గాలికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మొత్తానికి ప్రయాణాన్ని అందంగా అనుభూతిచెందుతుంది  బిట్టు .
 ఒక రోజు ప్రయాణం అయిపొయింది ఇంకో రోజు ప్రయాణిస్తే  ఎప్పుడు వెళ్ళే ఆ వలస ప్రాంతాన్ని చేరుకోవచ్చు .ఉదయం కొండల మధ్యనుంచి మంచు తెరను నెమ్మదిగా చుడుతూ రంగు మారుతూ పెరుగుతున్న సూర్యుడిని అలా చూడడం అదే మొదటి సారి బిట్టుకి .అక్కడి నీటి దారాలపై భానుడి కిరణాలు పడి ధగ ధగ మెరుస్తూ సప్త వర్ణాలు ఆవిష్కరిసుంటే , కళ్ళలో ఆ కాంతి పరావర్తనం చెంది కొత్త అనుభూతి పొందుతూ ఈ చెట్టు పై నుండి ఆ చెట్టు పైకి ఆ చెట్టు మీదనుండి ఇంకో చెట్టు పైకి ఎగురుతూ కొత్త కొత్తగా కిల కిలా రావాలు చేస్తుంటే బిట్టు తల్లి తండ్రులకి కుడా ఆనందమేస్తుంది .మొన్నా మధ్యే గూడు కట్టుకునేప్పుడు వాళ్లతో కలిసి ఒక్కో గడ్డి పోచ తీసుకుని వెళుతూ ఎంత సహాయంగా ఉందో  వాళ్ళకి . వాళ్ళుండే ఆ చెట్టుపై పక్షులన్నిటికి అంత ప్రేమ మరి బిట్టుని తన ప్రవర్తనని చూసి .ఆ రోజంతా ఆనందగా అక్కడే గడిపేసి మళ్ళీ సూర్యాస్తమయానికి ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరు . 

అదో దట్టమైన అడవి అక్కడ జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించారు కుటుంభసభ్యులు. ఒక్క సారిగా బిట్టుకు రక్షించమంటూ అరుస్తున్న మరో జాతి పక్షుల ఆర్తనాదాలు వినిపించాయి .. 
-"తాత తాతా  ఎవరో ప్రమాదంలో ఉన్నారు రక్షించమని అరుస్తున్నారు .సహాయ పడదామా  ?"అని  గుంపు నాయకుడ్ని అడిగింది బిట్టు . 
-" ఇలాంటివి పట్టించుకోవద్దు బిట్టు నువ్వు ఇంకా మారు మాట్లాడకుండా మాతో పాటు రా ..!" అంటూ ఆజ్ఞ జారి చేసాడు ,తల్లి తండ్రులది  కూడా అదే మాట . అలాగే అంటూ తన వరసకెళ్ళి  మళ్ళీ ప్రయాణిస్తుంది .కొద్ది దూరం ఆ గుంపు ప్రయాణం సాగించి బిట్టు తల్లి వెనక్కి  చూస్తే   ,అక్కడ బిట్టు కనిపించలేదు .కంగారుగా అందరికి విషయాన్ని  చెప్పి ఏడవడం మొదలు పెట్టింది తల్లి పక్షి  .
  
                                                  *   *    *     *    *   *    *

ఆ ఆర్తనాదాలు విని సహాయం చేయకుండా వెళ్లడం  బిట్టుకి నచ్చలేదు అందుకే మెల్లి మెళ్లిగా  వెనక్కి తగ్గి గుంపు నుంచి వెను  తిరిగి ఆ దట్టమైన అడవిలోకేల్లింది  బిట్టు . అలా అలా ఆ రోదన వినిపిస్తున్న స్థలానికి చేరుకుంది . తల్లి లేకుండా అల్లలాడుతున్న రెండు చిన్న పక్షులను ,ఇంకా ఎగరలేని  పక్షులను చూచి  ఒక్కో  విధమైన ప్రశ్నతొలుస్తుంటే ఆ గూట్లో వాలి ఏమయింది అని అడిగింది . గుక్క పట్టి ఏడుస్తూ అడవి పిల్లి గూటి పై దాడి చేస్తే తల్లి పక్షి పోరాడి ఎదిరించలేక ఓడిపోయి దానికి ఆహారంగా మారిన వైనాన్ని వివరిస్తూ ఏడుస్తుంటే బిట్టు కూడా కన్నీరు కార్చింది . మళ్ళీ ఏ క్షణమైనా అది వాళ్ళను తినడానికి తిరిగొస్తుందని అవి రెండు ప్రాణభయంతో గజ గజ వణికిపోతూ ఏడుస్తుంటే బిట్టుకి సహాయానికి రాని తాత తలి తండ్రులపై విపరీతమైన కోపం వచ్చింది .. కాని ఇప్పుడది ఒంటరిగా ఏం  చేయగలదు ?? ప్రమాదానికి ఇంకా కొన్ని అడుగుల దూరంలో ఉన్న పక్షుల జాబితాలో బిట్టు కూడా ఉన్నట్టే ఇప్పుడు .

ఆ చిన్నవైన రెండు పిల్ల పక్షులను  రక్షించడం ఇప్పుడు బిట్టు ముందు ఉన్న కర్తవ్యం . ఎలాగో ,అలాగా మొదట ఆ పిల్లల్ని అక్కడి ఆ గూట్లో నుంచి తప్పించాలి , ఏం  చేయాలి అని అలోచించి పక్కనే ఉన్న వెడల్పాటి ఆకులు గలిగిన చెట్టు నుంచి ఒక ఆకును విరిచి సరిగ్గా ఆ గూటికి కింద పరిచింది బిట్టు .ఇప్పుడు ఆ గూట్లోనుంచి  రెండు పక్షులను మెల్లిగా కిందకు తోసింది ధైర్యంగా ఉండమని నచ్చ చెప్పి ఒప్పించి మరీ .ఇప్పుడు ఆ రెండు పక్షులు చెట్టు కింద ఉన్న్న ఆ ఆకుపై ఒక దాన్ని ఒకటి హత్తుకుని కూర్చున్నాయి .బిట్టు ,మెల్లి మెల్లిగా ఆ ఆకును నోటితో లాగుతూ గూడున్న  చెట్టుకు కొంత దూరంలో ఒక కలుగు ఉంటె అందులో వీటిని దాచి దాన్ని ఆకుతో కప్పిన వెంటనే పిల్లి వస్తున్న శబ్ధం విని  చెట్టు వెనక దాక్కుని చూస్తుంది . మంచి భోజనం దొరికిందని ఆత్రంగా తిరిగొచ్చిన వచ్చిన పిల్లికి గూట్లో పక్షి పిల్లలు కనిపించక పోయే సరికి కోపంతో అరుస్తూ ఆ చెట్టంతా  చూసింది అయినా అవి దొరకలేదు . మెల్లిగా చెట్టు దిగి వెను  దిరగ బోతుంటే చెట్టు వెనక దాక్కున్న బిట్టు కనిపించింది . 
వెంటనే బిట్టుని పట్టుకొనడానికి బిట్టు పైకి దూకింది పిల్లి .ఆ చిన్న దేహంతోనే ఆ పిల్లితో యుద్ధానికి దిగింది బిట్టు .ఎంత బలాన్ని కూడ దీసుకున్నా ఏంలాభం  ? బిట్టుకి వంటినిండా గాయాలయ్యాయి అయినా తన ముక్కుతో దాడి చేయడానికి వచ్చిన పిల్లిని పొడుస్తూనే ఉంది .. ఆ ప్రయత్నంలో బిట్టు కాలు విరిగింది ఇక బిట్టు కూడా చేతులెత్తేసే సమయం కళ్ళు మూతలు పడుతుంటే ఒంటినిండా రక్తం స్రవిస్తుంటే ఒక్కనిమిషం తల్లి దండ్రులను ,తాతని గుర్తు చేసుకుంది .ఇక పిల్లి చివరిసారిగా బిట్టుపై తన బలమైన పంజాతో విరుచుకు పడపోబోతుంటే .....

                                                   

                            *     *     *      *     *       *      *   *

...
............ఆశ్చర్యం ,బిట్టు కుటుంబం , పక్షుల గుంపు అంతా  వచ్చాయి ఆ పిల్లిని పొడిచి పొడిచి బెదర గొట్టి తరిమేసాయి .స్పృహ కోల్పోతున్న బిట్టుని ఆప్యాయంగా నిమురుతూ పక్కనే ఏవో పాఠాలు ఔషదపు  ఆకులుంటే దాన్ని బిట్టు గాయాలపై రాస్తూ , తన మెలకువ గురించి చూస్తున్నాయి బిట్టు కుటుంబ సభ్యులన్నీ .కొద్ది సేపటి తరువాత బిట్టుకి మెలకువ వచ్చింది కాని ఎగిరే ప్రయత్నం చేస్తున్నబిట్టు ఒక నిమిషం అలా కూల బడిపోయింది , దాని కాలు ఒకటి విరిగిపోయింది ఇకపై అది ఎగరగలదేమో కాని నిలబడలేదు . బాధ ఏంటో తెలుస్తున్నా భరించడం కూడా అప్పుడప్పుడే నేర్చుకున్నట్టుంది .తల్లిని పిలిచి ఆ కలుగు పై ఆకుని తొలగించమన్నది .అలాగే చేసిన తల్లికి రెండు చిన్న పక్షి పిల్లలు ఒక దాన్ని ఒకటి హత్తుకొని భయంతో కూర్చోవడం చూసి బయటికి లాగింది . ఎం జరిగిందో అంతా ఉన్నది ,ఉన్నట్టుగా వాళ్ళందరికీ వివరించాయి ఆ చిన్న పక్షులు .బిట్టు చేసిన పనికి మెచ్చుకున్నా జీవితాంతం ఇక కాలు లేని పక్షిగా ఉంది పో వలసిందే బిట్టు .అయినా రెండు ప్రాణాల్ని కాపాడిన ఆనందం  ముందు అదేది కనిపించడం లేదు . ఆ రెండు పక్షులను ఆ గుంపులోని పెద్ద పక్షులు నోటికి కరుచుకుని ,బిట్టుని తల్లి తండ్రి ఇద్దరు భుజాల రెక్కలపై ఎక్కించుకుని ప్రయాణం సాగించాయి .

అనుకున్నట్టే కాక పోయిన ,ఆలస్యంగా అయినా వలస  వెళ్ళాల్సిన స్థలానికి చేరుకున్నాయి .బిట్టు స్నేహితులందరికీ తను చేసిన సాహసం గురించి తెలిసింది అందరు చూడడానికి వస్తున్నాయి .ఒక్క కాలుతో ఇక కుంటుతూ మెల్లిగా నడవడం , ఒక కొమ్మ మీదనుంచి ఇంకో కొమ్మ పైకి ఎగిరి అక్కడ కూర్చుని స్నేహితులతో కబుర్లు చెప్పుకునే పరిస్థితి ఇప్పడు లేదు బిట్టుకి .అలా ఆలోచిస్తూ ఆ అనాధ అయిన పక్షులని  చూస్తూ వాటితో ప్రతి రోజు మాట్లాడుతూ ఆది పొందే అనుభవాలన్నీ .చెప్పింది ... ప్రాణానికి మించి ప్రయాస పడి  కాపాడిన బిట్టునే వాటికి ఇప్పటిన్చుచి అమ్మా నాన్నా అన్నీ  అని నిర్దారించుకుని జీవితాంతం బిట్టుకు చేదోడు వాదోడు గా ఉంటామని తీర్మనంచు కున్నాయి ..
వలస కెళ్ళిన ప్రాంతాన్ని   అలా కొంచెం సేపు ఒంటి కాలుతోనేఎగురుతూ ఆ ప్రాంతమంతా చూసి హాయి నింపుకుని తన జీవిత ఉద్దేశం ఇదే కాబోలు అనుకోని తాత దగ్గర కూర్చొని ఇంకా అనుభవపు పాఠాలు నేర్చుకునే ఆసక్తి ఉందని -" తాతా "  అని పిలిస్తే , బిట్టు తాత కళ్ళలో కన్నీళ్ల ప్రశ్నలన్నీ కరిగి -" జీవితం గురించి  తాతకే ఒక పాఠం నేర్పావు బిట్టు అని " గట్టిగా బిట్టుని హత్తుకున్నాడు తాత ,నా ఆయుష్షు కూడా నువ్వే పోసుకుని తరువాత ఈ గుంపుకి నువ్వే నాయకుడవని చెప్పి అనుభవానికి ,మంచి మనసుకి ,అంగవైకల్యం ఎప్పుడు అడ్డురాదని అందరికి ఆ రోజుటి ప్రభోదన చేస్తూ ..



---------------------------------  by -Mercy Margaret (13/12/2012)_--------------------------------------------------------------------------------------