Saturday, October 11, 2014

కథ శీర్షిక : సహజ
---------------------------------
ఇంత జరిగిందని తెలిసాక  వినయ్ తనని ఏలుకుంటాడ? అదే ప్రేమతో చూస్తాడా ? తనకంటే ముందు ఈ సమాజం, బంధువులు తనను స్వీకరిస్తారా ? తను పనిచేసే చోట, బయట, ఇరుగు పొరుగు వారికి తెలిస్తే  ఇక తన జీవితం వెక్కిరింతల పాలైన కథలా అందరినోట నానుతుంది కదా !?. ఇప్పుడెలా ??
-"అవును  ముగింపు , ఒకే ఒక ముగింపు కావాలి . దీనికి నేనే ఒక ముగింపు రాయాలి. కాలం తీరాక రాలిపోయే ఆకు ముగింపా ?? నది నుండి వేరై వేటగాడి గాలానికెళ్లి చిక్కుకునే ముగింపా ? రాత సరిగా రాయబడలేదని పుస్తకం నుంచి వేరు చేసే చిత్తుకాగితం ముగింపా ??..  "అనుకుంటూ ..

పిల్లల్ని స్కూల్ బస్సు ఎక్కించిన తరువాత తన కధకి ఒక ముగింపు రచన చేసుకోవాలని నిర్ణయించుకుంది సహజ. వణుకుతున్న కాళ్ళు ఆగని కన్నీళ్లు. ఇలాంటి ముగింపు కారణమైన  దేవుణ్ణి మనసులో ప్రశ్నిస్తూ , బ్రద్దలవుతున్న గుండె, కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీటిని దిగమింగుతూ తనతో తను ఎప్పుడూ మాట్లాడుకోనంత మాట్లాడుతుంది. ఒంటరిగా ఉండే కొందరిని చూసి ఒకప్పుడు ప్రశ్నించుకున్న తను ఇప్పుడు తనకు ఏకాంతం కావాలో ఒంటరితనం కావాలో, ఏ పరిస్థితుల్లో తను ఉందో  తేల్చుకోలేక నదికి అవతలా ఇవతలా వంతెనెలా కట్టుకోవాలో అని ఆలోచిస్తుంది.

 రాజీవ్ పరిస్థితి విషమం అని బాధపడాలో, లేక వినయ్ ప్రేమ కోల్పోయి భర్తకి పిల్లలకి దూరమవుతానేమో  నన్న భయం మీదకి దూకబోతున్న సింహలా కనిపిస్తుంటే , ఆ  బాధ తుఫానై  తనను ముంచేస్తుంటే, జీవితానికి పరిష్కారం ఇచ్చే స్థితిలో కాలం లేదని లోలోపలే శకలాల్లా విరిగిపోతూ నిస్సహాయలా ఆలోచనలతో కొట్టుకుపోతుంది  సహజ.

పిల్లల్ని స్కూల్ కి  సిద్ధం చేసి గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుని బాగా చదవాలని చెప్పి ఇద్దరినీ దగ్గరకు తీసుకుని కూర్చుని స్కూల్ బస్ కోసం ఎదురు చూస్తుంది. స్కూల్ టైం అవ్తుండడం అయినా బస్సు రాకపోవడం చూసి పక్కనే ఉన్న సెల్ స్విచ్ ఆన్ చేసి బస్సు డ్రైవర్'కి  డయల్  చేసింది.

__" హలో గిరి నేను సహజ. రౌనక్  రియాల అమ్మని మాట్లాడుతున్నాను. ఇవ్వాళ స్కూల్ బస్సు రాలేదేంటి "?
___" మేడం గుడ్ మార్నింగ్. సర్ ఫోన్ చేసి వాళ్ళిద్దరూ ఇవ్వాళ స్కూల్ కి రావడం లేదు. నువ్వు రానవసరం లేదని చెప్పారు "
___" అలాగా  సరే ".. అంటూ ఏదో సందిగ్ధతతో ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది .

పిల్లలు స్కూల్ కి రారని ఎందుకు వాళ్ళని ఇంట్లోనే ఉంచాలనుకున్నాడు ?. ఏమయ్యుంటుంది ?, విషయం ఏమైనా వినయ్ కి తెలిసిందా ? అని వినయ్ నంబర్ కి డయల్ చేసి తను రిసీవ్ చేసుకోనందుకు కోపంగా ఫోన్ పడేసింది.

                                                                *   *   *    *   *   *

_____" మమ్మీ మమ్మీ ఫోన్ అంటూ " దీర్ఘాలోచనలో ఉన్న సహజకు కూతురు ఫోన్  అందించింది.
_____" ఎవరు ?"
____" నేను సహజ వినయ్. ఏమయ్యింది ?ఫోన్ రిసీవ్ చేయడానికి ఇంత లేట్ చేశావ్ ?.ఇది ఆరవ సారి కాల్ చేయడం . అలా పరధ్యానంలో ఉంటే ఎలా ? సరేగాని తొందరగా రెడీ అయిఉండు. బయటికి వెళ్ళాలి. నేను ఓ గంటలో వస్తాను. " ఫోన్ పెట్టేసాడు వినయ్.

వినయ్ చెప్పినట్టుగానే ఏదో అలా తయారై పిల్లలు టీవీ పెడితే చూస్తుంది . చానెళ్ళు తిప్పుతున్న పిల్లల్ని మందలించే తను ఇవ్వాళ  అస్సలు ఏ లోకంలో ఉందో తనకే తెలియదు. ఇంతలో ఓ న్యూస్ చానెల్ లో
 __"చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ భగ్న ప్రేమికుడు అని తన జేబులో దొరికిన ఉత్తరం, దానితో పాటు తను రాజీవ్ కలిసి తీసుకున్న ఫోటో చూసి ఒక్కసారి కుప్పకూలిపోయింది . టీవీ ఆఫ్ చేసి తిరిగి ఆలోచనల్లో పడింది .
టీవీలో  వార్త గాని వినయ్ చూడలేదు కదా .. ? చూసుంటే ఎలా ? రెడీ అయిఉండమని ఎటు తీసుకెళతాడు ? తన మెదడులో, మనసులో రేగుతున్న అలజడి. ప్రశ్నలు సమ్మెట దెబ్బలేస్తున్నయి మెదడు చిట్లిపోయెంత నొప్పి. పెరుగుతున్న గుండె వేగం అంతా ఇంతా  కాదు. కాలింగ్ బెల్ మొగుతుంది .

_____" ఏంటి సహజ ఇంత  ఆలస్యంగానా తలుపు తీసేది ? సరే గాని రెడీ అయ్యావ్ గా పదా బయల్దేరుదాం ".
_____"ఎక్కడికి వినయ్ ?"
_____"పద ముందు చెబుతాను . పిల్లలూ ఇంట్లోనే ఉండండి . పనమ్మాయి వాచ్ మెన్ ఇక్కడే ఉంటారు. నేను మమ్మీ బయటికి వెళ్తున్నాం . సరేనా ?"
____"రా సహజ " అని తన ఎడమ చేతిని పట్టుకుని ఇంటి నుంచి బయటికి నడుస్తున్నాడు . అచ్చంగా తన పెళ్లిరోజు కళ్ళముందు కనిపిస్తుంది సహజకి . అలాగే వణుకుతున్న కాళ్ళతో, చెమటలు పడుతున్న చేతులను తుడుచుకుంటూ కార్లో కూర్చుంది సహజ .

__" ఎటు వెళ్తున్నాం "
___" నీకే తెలుస్తుంది  కొంచెం ఓపిక పట్టు సహజ "
____"నీతో ఒక విషయం చెప్పాలి వినయ్"
___"ఇప్పుడొద్దు సహజ ఇంటికెళ్ళాక చెప్పుదూలే "
ఆ మాట విని ఆగిపోయింది సహజ . ఇక ఏం  మాట్లాడగలదు ?

అదే ముందటి సహజ అయితే గోల పెట్టుకునైనా, గొడవ పెట్టుకునైనా తన పంతం నెగ్గించుకునేది . సమంగా సంపాదించగలనన్న అతిశయోక్తి లోలోపల. కాని ఇప్పుడు అలా చేయలేదు .
'నిజమే కదా అపరాధబావం మనిషిని మూలాల్లోంచి పెకిలించేస్తుంది . మనసును త్రవ్వుతూ హృదయాన్ని స్వాదీనం చెసుకుని ఎవరిని వారికే కాకుండా చేస్తుంది .'

కారు సోమాజిగుడా  వైపుగా  వెళ్తుంది . ఆఫీస్ కేమైనా తీసుకెళ్తున్నాడా ? సహజ హృదయంలో ప్రశ్నల శరాలు. తట్టుకోలేక , మాట్లాడలేక , బయటికి ఏడ్వలేక తదేకంగా కార్ కిటికీలోంచి బయటికి చూస్తుండి పోయింది . కార్ డ్రైవ్ చేస్తూ వినయ్ కూడా నిన్నటి విషయాలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటున్నాడు .

                                             *   *     *     *     *     *    *   *   *  *

నిన్న సాయంత్రం ఆరున్నర :

తన కళ్ళు నాకెప్పుడు అబద్ధం చెప్పవు . పెళ్ళయ్యింది మొదలు ఆనందం, దుఃఖo, ప్రేమ, అనుమానం  లాంటి ఎన్నో భావాలు , ఎప్పటికప్పుడు చూపుల రాతలతో నాహృదయంతో మాట్లాడేది. ఏది దాచుకోలేక పోయేది . ఏంటో ఏడ్చి వచ్చినట్టుంది . ఆఫీస్ లో అంత సజావుగానే సాగిఉంటుందా ? టీం మానేజరుతో ఈ మధ్య పడడంలేదు అంది ఏమయ్యుంటుందో ?
___"సహజ .. సహజ . !! ఎంత సేపు వాష్ రూంలో కాఫీకలిపాను చల్లారిపోతుంది త్వరగా రా "
___" వస్తున్నాను వినయ్"

పెళ్ళయిన కొత్తలో మొగుడు హోదా అడుగుతాడేమోనని'' ఏవండీ '' అని పిలిచేది కాని వినయ్ ఎంతో పరిణతి చెందినవాడు . తనను స్నేహితునిలా భావించి మెసలమని ప్రోత్సహించాడు. అందుకే తనని వినయ్ అని విన్నూ అని పిలుస్తుంది సహజ. వినయ్ పరిణతితో పాటు ఆలోచనా పరంగా, మానసికంగా , మానవత్వం స్వేఛ్చ పట్ల ఖచ్చితమైన అభిప్రయాలు కలవాడు. స్టూడెంట్‌లా ఉంటూనే ఎన్నో సామాజిక సంస్థలతో అనుబంధం కలిగి ఉండి పలు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని వాలంటీర్ గా ట్రైనర్ గా పని చేసాడు. ఆ అంశాలే తనను సమాజంలోని అనేకమైన విషయాలపై అవగాహన పెంచుకునేలా చేసాయి. ప్రతి అంశాన్ని పరిశీలనాత్మకంగా చూసే మనిషి . సహజ అప్పుడప్పుడు దూకుడుగా తనను దూషించినా ఓర్చుకునే వాడు. తను డిగ్రీకి రావడంతోనే తండ్రి చనిపోతే ఇద్దరు చెల్లెళ్ళను చదివించి తండ్రి సంపాదించిన ఆస్థులమ్మి వారికి పెళ్లి చేసాడు. తనకోసం ఏమి ఉంచుకోలేదు . తల్లి కూడా ముగ్గురి దగ్గర కొన్ని కొన్ని నెలలు ఉంటూ జీవితాన్ని గడుపుతుంది. అయినా ఏదో అసంతృప్తి సహజలో అంత మంచి భర్తను చేసుకున్నందుకు సంభరపడాలో లేక అతి మంచితనం గల వ్యక్తని బాధపడాలో తనకు అర్ధం కాక వినయ్ పై చిరాకు పడేది. అప్పుడప్పుడు పండగలకు ఇంటికొచ్చిన ఆడపడుచుల ముందు కూడా చులకనగా మాట్లాడినా వినయ్ మాత్రం సహజను ఎవ్వరి ముందు విమర్శించలేదు. కుటుంబం గురించి భాద్యతల గురించి పిల్లల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ? లేదా అంటూ దెప్పి పొడిచేది. ఆస్తినంత అమ్మి తనకేమి మిగిల్చుకోలేదని కోపం. MBA  చదివి తరువాత తనకున్న ఆసక్తి మేరకు MA సోషియాలజి చేసి ఒక మంచి MNC లో CSR  హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు డెబ్బై వేల వరకు సంపాదిస్తున్నాడు . సహజ కూడా ఒక మంచి కంపెనీలో HR  మానేజరు గా చేస్తుంది. రియా రౌనాక్ లను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిస్తున్నారు . నాలుగేళ్ల క్రితమే ఇద్దరి ఆఫీసులకి దగ్గరగా ఉంటుందని అమీర్‌పేట్ లోని ఒక అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్ తీసుకున్నారు. అంతా సజావుగానే సాగిపోతుంది .

ఏం జరిగిందో ఎప్పుడూ  కనిపించని దిగులు భయం సహజ కళ్ళను చిలుకుతూ ఎరుపు చేస్తూ నీళ్ళను ఉబికిస్తున్నాయి. ప్రక్కనే కూర్చుని కాఫీ తాగుతున్నా ఎప్పటిలా ఆఫీసు విషయాలు తనతో మాట్లాడే సహజ ఈ పదేళ్లల్లో ఎప్పుడూ లేనంత దిగులుగా కనిపిస్తుంది. మౌనం వారిరువురి మధ్య ఏదో కొత్త సంఘటనకి తెర లేపబోతున్నట్టు సూచిస్తుంది.

                                          *   *    *   *   *   *   *   *   *  *   *   *
సమయం రాత్రి 9 దాటుతుంది  :

__"సహజ ఎందుకలా ఉన్నావ్ ?? సాయంత్రమే నిన్నడగాల్సింది . ఏదో దీర్ఘాలోచనలో ఉన్నావని డిస్టర్బ్ చేయడం ఎందుకని అడగలేదు. ఇప్పుడైనా చెప్తావా ? అంటూ అడిగాడు వినయ్. సహజ నుదుటిపై చేయిపెట్టి జ్వరం ఏమైనా ఉందా ?అని పరీక్షగా చూస్తూ .. "
వినయ్  చేయి  సహజ నుదురు తాకగానే ఒక్కసారి ఉలిక్కిపడి  లేచి కూచుంది సహజ.

___"ఏమయ్యిందిరా ? ఎందుకింత నీరసంగా  ఉన్నావ్ ? నాతో  షేర్ చేసుకోవచ్చుకదా కొంచెం కుదుటపడతావ్ ". అంటూ తనను దగ్గరిగా తీసుకున్న వినయ్ భుజంపై తలవాల్చి అలాగే ఏడుస్తూ ఉండిపోయింది కాసేపు .
__" సరే భోజనం తీసుకొస్తాను. ఇక్కడే తిందువు గాని" అంటూ  వినయ్ భోజనం తేవడానికి బెడ్ రూం నుంచి బయటికి నడిచాడు . మంచం మీది నుంచి లేచి అద్దంలో ముఖం చూసుకుంటూ చెదిరిన జుట్టు సరిచేసుకుంటూ ఆలోచనలో పడింది సహజ .

__" జరిగిందేదో జరిగిపోయింది. ఇలాగే ఉంటె వినయ్  దృష్టిలో నేను నేరస్తురాలిగా మిగిలిపోయి ఇక తన ప్రేమ పొందుకోలేను. నా భావోద్వేగాలను బాధను అదుపులో ఉంచుకోవాలి. ఒకసారి జీవితాన్ని పోగొట్టుకున్నాను. అయిందేదో అయ్యింది  జీవితం దిద్దుకోమని నన్ను చేర్చుకొని అవకాశం ఇచ్చింది కాలం. నేను నా కుటుంభం నా పిల్లలు  నాకు ముఖ్యం . గతం పిలిచినా ప్రస్థుతాన్ని వదిలి వెనక్కి వెళ్లి నాకు నేను మోసాన్ని బహుమతిగా ఇచ్చుకోలేనుగా. అంతటి మూర్ఖురాలిని కాలేను కాని ఈ విషయం వినయ్ కి తెలిస్తే ? నన్ను ఇప్పుడెంత ప్రేమగా చూసుకుంటున్నాడో అంతే  ప్రేమగా ఆదరించగలడా ?ఎన్ని మాటలన్నా విసిగించినా ఓర్చుకున్న  మంచి మనిషి గతం చేసిన గాయాల్ని చిరాకుగా అతనిపై ప్రదర్శించినా ఏనాడు నోరెత్తి పల్లెత్తు మాట  అనని వ్యక్తి. నా స్వాతంత్ర్యాన్ని స్వేచ్చ్చని గౌరవించి ఏనాడు నా భావాలు దెబ్బతీయని వ్యక్తిత్వం గల నా భర్త వినయ్  ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఊరుకుంటాడా ?" అని ఆలోచిస్తూ ..... తన ఆలోచనలతో తనే విభేదిస్తుంది అప్పటికప్పుడే __" అవునులే ఏ భర్త జీర్ణించుకోగలడు? తన భార్యకు ఇలాంటి గతం ఉందంటే ? వినయ్ కూడా' మగ '' వాడే కదా !. అంటూ భయం, ఆలోచనలు తనపై చేస్తున్న దాడిని ఏడుస్తూనే ఎదుర్కొంటూ వెళ్లి పిల్లల ప్రక్కనే పడుకునిపోయింది సహజ .

__"సహజ ... సహజ ఎక్కడా ?? అంటూ తన గదిలో లేని సహజను పిల్లల గదిలో వాళ్ళను హత్తుకొని పడుకోవడం చూసి వెళ్లి బెడ్ రూమ్ లో నిద్రకు ఉపక్రమించాడు వినయ్.

ఎప్పటిలాగే పెద్ద మోత పెడుతూ అలారం అరుస్తుంటే దాని తలపై ఒకటి మొత్తి సగం మూసుకున్న కళ్ళతో వాష్ రూం కెళ్ళి  మొహం కడుక్కుని బయటికెళ్ళి పాల ప్యాకెట్ల తో పాటు అక్కడే ఉన్న న్యూస్ పేపరు తీసుకొని లోపలికొచ్చాడు వినయ్. సహజ ఇంకా నిద్రనుంచి లేచినట్టు లేదని తనే కాఫీ కలుపుకుని ఆ రోజుటి పేపరు తిప్పుతూ ఒక్కసారి కాఫీ కప్పు పక్కకు పెట్టి, ఆ వార్త పత్రికలోని వార్తను మరోసారి తీక్షణంగా చదువుతున్నాడు. అతని హృదయం వేగంగా కొట్టుకుంది. కళ్ళు ఎరుపెక్కాయి. గుండెను గట్టిగా పట్టుకుని మెలిపెడుతున్నట్టు  ఏదో బాధ. కొద్దిసేపటికి తేరుకొని తయారై సహజను పిల్లల్ని నిద్ర లేపకుండానే కారు తీసుకొని బయలు దేరాడు.

అలా నిన్నటి నుండి ఇవాల్టి వరకు జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదులుతుంటే కారు డ్రైవ్ చేస్తున్నాడు వినయ్ . ప్రక్కనే దిగులుగా ఉన్న సహజవైపు చూస్తే ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుంది. తనని కదపలేదు పిలవలేదు. తదేకంగా కారు లోంచి బయటికి చూస్తుంది. సహజకు  నిన్న జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు ఒక్కొక్కటిగా కనబడి బయపెడుతున్నట్టున్నాయి.

                                              *   *   *   *   *   *   *   *   *  *  *  *  *

నిన్న సహజ  ఆఫీస్ అయిపోయిన తరువాత :

తన కార్ పార్క్ చేసిన స్థలం  వైపుకు బయల్దేరింది సహజ . ఒక్కసారి అమాంతంగా పరుగెత్తుకుని వచ్చి సహజ కాళ్ళు పట్టుకున్నాడు రాజీవ్ బిగ్గరగా ఏడుస్తూ . పాతబడ్డ బట్టలు, మాసిపోయిన జుట్టుతో పోల్చుకోలేకుండా తయారైయ్యాడు.

___"ఎదురుచూస్తున్నా చచ్చిపోతున్నా, నిన్ను చూడకుండా  ఉండలేను. " ఏడుస్తూ చేతులు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. ఒక్కసారి రాజీవ్‌ని అలా చూడగానే సహజ నిర్ఘాంతపోయింది . ఉన్నపళాన  చీకటంతా వలగా మారి తనను కమ్మేసిందా అన్నట్టు వణికిపోయింది.

 ___" వదులు రాజీవ్. పదేళ్ళ క్రితం నేను నీ గురించి చాలానే ఏడ్చాను. నువ్వు రాలేదు. ఎదురు చూసేంత ఓపిక నాకు ఉన్నా. మా ఇంట్లో వాళ్ళకి లేదు. అందుకే పెళ్లి చేశారు. మనసు నీ దగ్గరే ఉండిపోయినా మరో పెళ్లి చేసుకుని నేను అనుభవించిన నరకం అంతాఇంతా కాదు. ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తితో జీవితం పంచుకోవాల్సి వస్తే కలిగే బాధ అనుభవిస్తున్న ఆ స్త్రీకే తెలుసు. ఇప్పుడు నాకు పెళ్ళయి పదేళ్ళు. ఏ  ధైర్యంతో ఇలా అడుగుతున్నావ్? అనుమానంతో లేని సంబంధాన్ని అంటగట్టి, ఏమైపోతానో అని కూడా  ఆలోచించకుండా వదిలి  వెళ్ళిపోయాక ఇప్పుడు, నీ విలువ తెలిసింది నీ ప్రేమ లేకుండా నేను ఉండలేను అంటే ఎలా వచ్చేది ? " అని మాట్లాడుతుండగానే ..
___" సహజ .. సహజ ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకు అంటూ గట్టిగా ఏడుస్తూ "
తన చేతులు పట్టుకుని బ్రతిమాలుతున్న రాజీవ్‌ని దూరంగా నెట్టి -" పిచ్చిగా మాట్లాడకు రాజీవ్ నన్ను వదిలేయ్" కార్ తీసుకొని బయలు దేరింది సహజ.

కార్ వెనకే పరుగెత్తి వస్తున్న రాజీవ్. ఇంతలో ఏం  జరిగిందో పెద్ద శబ్ధం  కారు అద్దంలోంచి గుంపులు గుంపులుగా పరుగెడుతున్న జనాన్ని చూసి గట్టిగా ఏడుస్తూ ఇంటికి బయలు దేరింది . ఆ కన్నీటికి ఇప్పటి వరకు విరామమే లేదు . ఇంతలో
__"సహజ  దిగు  వచ్చేశాం  " అని కారు డోర్  తీసాడు వినయ్ .

                                        *    *     *      *     *     *     *    *   *     *     *     *

స్థలం - యశోదా హాస్పిటల్ సోమాజిగూడ :

కారు దిగిన సహజకి ఒక్కసారి గుండె ఆగిపోయినంతపనైయ్యింది. తన జీవితంలో ఏ రోజైతే రాకూడదని అనుకుందో అదే రోజు వచ్చిముందు నిల్చుంది. తన స్థితి గమనించిన వినయ్ గట్టిగా ఆమె చేతిని పట్టుకుని లోనికి నడుస్తున్నాడు. తన భర్తకు విషయం తెలిసిపోయింది. ఇక జరుగబోయే పరిణామాలేంటో అని భయం భయంగా అడుగులు వేయలేక వినయ్ వెనకే నడుస్తుంది. అయితే ఉదయమే వినయ్ హాస్పిటల్ కొచ్చాడని నిర్ధారణ చేసుకుంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆపలేని దుఃఖాన్ని చీరకొంగు వెనక కప్పి పెట్టే  ప్రయత్నం చేస్తుంది .

ఇద్దరూ  అలా రాజీవ్‌ని ఉంచిన ICU  వైపు నడిచారు. భయంకరమైన స్థితిలో ఇక చచ్చిపోతాడో బ్రతుకుతాడో తెలియని పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న్డాడు రాజీవ్. బోరుమంటూ ఏడవాలనుంది సహజకు కాని ఏం  చేయగలదు? కళ్ళు కన్నీళ్లు ఒకటయ్యాయి . భర్తవైపు చూసింది. వినయ్ కళ్ళలో అదే ప్రశాంతత . అదే ప్రేమ కొంచెం కూడా మార్పు లేదు.

___"సహజ ఇక్కడే ఉండు నేను డాక్టర్ని కలసి వస్తాను '
__"వద్దు వినయ్ .. ప్లీజ్ ఇక్కడే ఉండు.  నా చేయి వదిలి వెళ్ళద్దు . నాకు భయంగా ఉంది " అంటూ ఏడుస్తూ సహజ.
___" ఎటూ వెళ్ళట్లేదు డాక్టర్ని కలిసొస్తాను. ధైర్యంగా ఉండు". అంటూ బయటికెల్లాడు వినయ్ .

 ICU లోకి వెళ్ళే పర్మిషన్ లేకపోయినా లోపలికెళ్ళి  రాజీవ్ ని అలా చూస్తూ చలించిపోయింది సహజ. పదేళ్ళు వెనక్కెళ్ళి ఒక్కసారి ఆ గతం , ఆ ప్రేమ , ఆ  మనిషిని గుర్తుచేస్తుకుంటూ ..
__" రాజీవ్.....  రాజీవ్  ఒక్కసారి కళ్ళుతెరువు. ఒక్కసారి నను చూడు అంటూ ఏడుస్తూ తన కుడి చేతితో అతని పట్టుకుని ఏడ్చింది.

"సహజ చేయి తగులుతూనే, ఆమె స్వరం వింటూనే ఏదో స్పృహ రాజీవ్ శరీరంలోకి ప్రవహించింది. ఈ లోపు వినయ్ డాక్టర్ని తీసుకొని అక్కడికి చేరుకున్నాడు. డాక్టర్ ఏవో పరీక్షలు చేసి రాజీవ్ ఆరోగ్యం కుదుట పడిందని, ఇక ఏ భయం అవసరంలేదని చెప్పి వెళ్ళాడు .

                                                *  *   *   *    *   *   *   *    *   *   *   *
ఇద్దరూ  సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు . ఇప్పుడు సహజ వినయ్ లో ఓదారుస్తున్న ఒక మంచి స్నేహితున్ని చూస్తుంది. బాధను పంచుకుంటూ అండగా నిలబడ్డ తండ్రిని చూసుకుంటుంది. ఆ పరిస్థితుల్లో వేరే మొగాడైతే తనను స్వీకరించి ఉండేవాడా ? అని ఆలోచిస్తూ  కన్నీళ్లు కారుస్తుంది.

వినయ్ ఆమె  కన్నీళ్లు తుడుస్తూ పిచ్చి సహజ ' ఐ లవ్ యు రా " అని గట్టిగా తన కుడి చేయి పట్టుకున్నాడు. జీవితంలో ఇంతకు మించి ఏం ఆశిస్తుంది ఒక స్త్రీ. ఇంతగా అర్ధం చేసుకునే భర్త దొరకటం తన అదృష్టమే కదా అనుకుంటూ లోలోపల తను కొలిచే దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంది. నిజమైన ప్రేమ ఇంత విలువైనదిగా ఉంటుందా ?! అని అనుభవపూర్వకంగా తెలుసుకుని తన భర్తను  ఆ ప్రేమకు ప్రతి రూపమే అనుకుంటూ మళ్ళీ కొత్తగా చిగురిస్తున్న ప్రేమను అనుభూతిచెందింది.


ఈ లోపు రాజీవ్ బంధువులొచ్చారు. తన పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది కాబట్టి స్వస్థలానికి తీసుకెళ్ళి అక్కడే వైద్యం చేయించుకుంటామని డాక్టర్ తో మాట్లాడారు . రాజీవ్ ని వాళ్ళు అంబులెన్సు లో తీసుకొని బయలుదేరారు . వినయ్ సహజలు హాస్పిటల్  నుంచి బయటికొచ్చి ఇంటికి బయల్దేరారు. మార్గం అంతా  ప్రయాణంలో ఒక్క మాట మాట్లాడలేదు సహజ. ఇంటికెళ్ళాక కూడా వినయ్ ఇలాగే ఉంటాడా ? అని నిజమైన ప్రేమకు  నిర్వచనాలెతుక్కుంటూ లోతుగా అన్వేషిస్తూ కాలాన్ని లెక్కబెడుతూ  ఆలోచనల్లో అలాగే ఉండిపోయింది. .

                                                 *  *   *   *   *    *   *  *   *
అపార్ట్మెంట్ సెల్లార్ లో కార్ పార్క్ చేసి ఫ్లాట్ వైపు నడుస్తుండగా సహజ ఒక్క సారి కళ్ళు తిరిగి కింద పడబోయింది. రెండు చేతుల్లో అలా తనను ఎత్తుకొని ఫ్లాట్ వైపు నడిచాడు వినయ్. నడుస్తున్నంత సేపు ఇద్దరి కళ్ళు ఒకరి హృదయాన్ని ఒకరి ముందు ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పుడు సహజ కళ్ళు మళ్ళీ అంతే స్పష్టంగా స్వచ్చంగా ప్ర్రేమగా లాలానగా ఆప్యాయంగా వినయ్ ని చూస్తున్నాయి. వినయ్  ప్రేమ  పొందడం ఎన్ని జన్మల పుణ్యమో అని మరో జన్మంటూ వుంటే అప్పుడు కూడా తననే భర్తగా ఇవ్వమని భగవంతుని కోరుతూ, తనలోని మార్పులకు పరివర్తనకు తలుపులు తెరిచింది.

సహజను అలా ఎత్తుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు వినయ్. అది చూసి పిల్లల్లిద్దరు ముసి ముసి నవ్వులు నవ్వు కుంటుంటే కాలిగ్ బెల్ మోగింది . వినయ్ తలుపు వైపు నడుస్తుంటే సహజ పిల్లలనిద్దరిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది.

__" థాంక్ యు " అని చెప్పి తలుపులు వేసి లిపలికొచ్చాడు వినయ్. సహజకి ఇష్టమైన పూలబొకేతో ... ఆ పూల బోకే సహజకి ఇస్తూ  మరో సారి " ఐ లవ్ యు " అంటూ సహజ కుడిచేతిని పట్టుకుంటే పిల్లలిద్దరూ చప్పట్లు కొడుతూ అల్లరి చేస్తుంటే, కన్నీళ్లిప్పుడు  ఆనందంతో కలిసి అతిథులుగా వచ్చాయి. సహజకిప్పుడు నిజమైన ప్రేమకి నిర్వచనం కూడా దొరికింది .
                                 
                                         ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~