Friday, July 10, 2015

ఒక్క అడుగు -" హలో .. ! అరేయ్ నైతిక్ ఇవ్వాళైనా కలవడానికి కుదురుతుందా భే  ?? "

-" ఆకాశ్  నువ్వా ఇండియా వచ్చావ్ అని తెలుసులే రా.. అయినా ఇప్పుడా నువ్వు నాకు ఫోన్ చేసేది ??గడీ గడీ కి మిస్డ్ కాల్స్ ఇస్తే గుర్తు పట్టలేననుకున్నావా భే ?? నిన్నూ నీ పిచ్చి లెక్ఖల్ని భరించలేంరా బాబు. ఇప్పుడు టైం  చూసుకున్నావా ఎంతైందో ? "

-" టైం దేముంది బావా మన మధ్యలో ? ఆటపట్టిస్తున్న  నవ్వు అటువైపు నుంచి. - " నువ్వు ఆరేళ్ళుగా ఏం పీకుతున్నావో తెలుసు ఎట్లైనా నువ్వు పడుకునేది ఏ పొద్దుటిపూటో కదా .. నువ్వూ నీ సివిల్స్ కోచింగూ సరిపోయింది తీయ్ ".

-" సరే సరే కలుద్దాం గాని నన్నుఒక నాలుగు గంటలైనా పడుకోనియ్యరా నీకు పుణ్యముంటుంది. సాయంత్రం కలుస్తా కదా మాట్లాడుకుందాం. సతీష్ గాణ్ణి , బోస్ గాణ్ణి  కూడా రమ్మని నువ్వే ఫోన్ చెయ్ "

- " సరే మంచిది వాళ్ళను కూడా రమ్మంటాను ఇక నువ్వు పడుకో మరి  .. బై .. బై ... " అంటూనే ఏదో గుర్తోచ్చినోడిలా -" హలో .. హలో .. హలో నైతిక్  " అని మళ్ళీ పలకరించాడు .

-" ఏంట్రా తొందరగా చెప్పు నిద్దరొస్తుంది "

-" 'సీమ' గురించి ఏం చెప్పలేదు ?"

-" రేయ్ దొరికావ్ అంటే నువ్వైపోయినట్టే రా నా చేతుల్లో. నా  మానాన , నా పని నేను చేసుకొని పోతుంటే నీ కతలేంటిరా ... సాయంత్రం కలుద్దాం అన్నా కదా .. సాయంత్రం మాట్లాడుకుందాం. మర్యాదగా ఫోన్ పెట్టేయ్ .. అయినా నువ్వు పెట్టేసేదేంటి నేనే కట్ చేస్తున్నా బై ...!! "  ఫోన్ కట్ చేసి సైలెంట్ మోడ్ లో పెట్టి నిద్రలోకి జారుకున్నాడు నైతిక్. అప్పుడే కోడికి సూర్యోదయమవుతున్న సంగతి తెలిసినట్టుంది. క్కో.. క్కో .. రోక్కో..   అని కూతేయడం కూడా కానిచ్చింది.

                                                               *   *   *   *  *  *  *

కిటికీలోంచి చల్లని గాలి లోనికి వీస్తుంటే, కరెంటు లేక ఫ్యాను తిరగకపోయినా ఒళ్ళంతా చల్లగాలి స్పర్శకు ఆహ్లాదంగా మురుస్తుంటే కళ్ళకు నిదుర గొళ్ళాలను వేద్దామనుకున్నా కుదరలేదు ఆకాశ్ కి. తన గదిలోంచి బయటికొచ్చి బాల్కనీలో చల్లగాలిని ఆస్వాదిస్తూ , పచార్లు చేస్తున్నాడు. అప్పుడప్పుడు తనలో తానే నవ్వుకుంటున్నాడు. మధ్య మధ్యలో రెండు చేతులను రుద్దుతూ  ముడుచుకుంటున్నాడు . జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి సమయం చూస్తున్నాడు.

చీపుళ్ళ శబ్దాలు, కళ్ళాపి సంగీతం  వినిపిస్తున్నాయి. తూరుపు తెరను తీసి బద్దకంగా రానా వద్దా అనుకుంటూ సూర్యుడు.  మబ్బులు పక్కకు జరపకుండా కాసేపు, జరిపినా మళ్ళీ దాక్కుంటూ కాసేపు బయటికొస్తున్నాడు. ఎప్పటిలాగే పక్షులు కిచకిచలతో  దేవునికి సుప్రభాతం పాడుతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు అనుకున్నాడో ఏమో? వెళ్లి షార్ట్ మార్చుకొని ప్యాంట్ వేసుకొని వేహికల్పై తానెప్పుడు ఇష్టంగా కాఫీ తాగే హోటల్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు. అచ్చంగా జూలై మాసం. దారిపొడవునా మొలుస్తున్న పచ్చగడ్డి. రాత్రి పడ్డ వర్షం వల్ల తోవపోదవునా గడ్డి వాసన. మొత్తానికి వదిలించుకోలేని కొన్ని జ్ఞాపకాలను తలపోసుకుంటూ హోటల్ చేరుకున్నాడు ఆకాశ్.

-"నమస్తే అన్నా ఏందీ చానా రోజుల తర్వాత. సూస్త సూస్త రెండేళ్ళయినట్టుంది కదా యీడికి రాక "

-" అవును యాది అమెరికా వెళ్లాగా ప్రాజెక్ట్ పని మీద. ఇప్పటికి కుదిరుంది. రెండు రోజులైంది వచ్చి. సుస్తీ తీరగానే నీ కాఫీనే గుర్తొచ్చింది వచ్చేశా "

-"గట్లనా పట్టు గరం...  గరం .. కాఫీ స్పెషల్ గా నీకోసం "

ఉదయం ఆరవుతుంది. అంట పొద్దున్న భవిష్యత్తుని వెతుక్కుంటూ పుస్తకాలు పట్టుకొని ట్యూషన్లు , కోచింగులకు పోతున్న పిల్లలు. కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తున్న ఆకాశ్ కి ఆ అమ్మాయి ఇంకా కనబడ్డమే లేదు.

-" యాది ఏమైంది?? ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి ఆ ఇంట్లో పిల్ల బయటికి రాలేదు ఇంకా.. ఈ టైం  కల్లా వచ్చేసేదిగా? " అని రెండేళ్ళ ముందు తను అమెరికా వెళ్ళక ముందు జరిగిన విషయాల కొనసాగింపు కోసం ఆధారం వెతుకుతున్నట్టు అడిగాడు ఆకాశ్.

ఆకాశ్ , సతీష్ కలిసి ఆ రోజు మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి ఆకాశ్ కి.

-" అవున్రా ఆకాశ్ ఈ రోజుల్లో కూడా ఎవరుంటార్రా ఇలా ? ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిముందు కడిగి కళ్ళాపి  చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు??  అని వెటకారంగా అన్నాడు సతీష్.

కాని ఆకాశ్ తన స్నేహితుడు చూడలేని ఇంకొన్ని వింతలూ చూస్తున్నాడు. ముగ్గు పెట్టేప్పుడు కదిలే చేతివేళ్లు. చేతులు కడులుతున్నంత సేపు వినిపిస్తున్న గాజుల శబ్ధం. చుక్కలు ముగ్గుగా కలపడానికి పాదాలు అటూ ఇటూ కదులుతున్నప్పుడు వచ్చే పట్టీల శబ్ధం. ఈ ముగ్గు కోసమే మీ వీధి కొస్తున్నానంటూ మొదటి కిరణంతో ముగ్గును, ముగ్గు వేస్తున్న అమ్మడు చేతుల్ని ముద్దు పెట్టుకునే సూర్యుడు. తనకి మాత్రం ఓ భావకవిత్వం ఆవిష్కరించ బడ్డట్టు అనిపించింది ఆకాశ్ కి.

ముగ్గేయడం అయిపోగానే వెళ్తూ వెళ్తూ తను ఒక్కసారైనా ఆకాశ్ ని ఓరకంట చూసి వెళ్ళేది. అది ఆకాశ్ గమనించినా , గమనించనట్టే ఉండేవాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే కళ్ళముందు ఆ అమ్మాయి అలా ముగ్గేసి లోనికి వెళ్తున్నట్టే అనిపించింది ఆ క్షణం ఆకాశ్ కి. కాని అది ఊహే యాది వచ్చి "అన్నా " అని పిలిచే వరకు.

-" ఎదురింటి సునీత మేడం గురించేనా అన్నా మీరు అడిగింది? ."

-" అవును యాది. రోజు ఈ టైం  కల్లా ముగ్గేయడానికి వచ్చేది. ఇవ్వాళ ఇంకా రాలేదే ?."

-" అదొక పెద్ద కథలే అన్న నువ్వు లేని ఈ మధ్యకాలంలో చాలా చాలా జరిగాయి"

-"ఏమైంది యాది ?" అని అడుగుతున్నంత లోనే సతీష్ నుంచి ఫోన్. - " ఏరా ఎక్కడా ??"

-"ఇక్కడేరా మన కాఫీ అడ్డా "

-" నేనొస్తాను అక్కడే ఉంటావా ? లేక ఇంటిదగ్గర ఉన్నా ఇక్కడే కలుద్దామా ?" అని అడిగాడు సతీష్.

-" నేనే వస్తాలేరా ఇక్కడ కన్నా ఇంట్లోనే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకో మళ్ళీ వర్షం పడుతుందేమో అన్న సందేహం నాకు. వస్తున్నా ఉండు " అని సతీష్ ఫోన్ కట్ చేశాడు.

-" యాది మళ్ళీ రేపు కలుస్తా మాట్లాడుకుందాం ". అని ఇంటికి వెళ్ళడానికి తన పల్సర్ బండిని  స్టార్ట్ చేసాడు.

                                                       *  *    *   *   *    *  *

 ఆకాశ్ బండి పై నుంచి దిగగానే వెళ్లి కౌగలించుకున్నాడు సతీష్.  -" అరేయ్ ఆకాశ్ రెండేలలలో మంచి కలరొచ్చావ్ గా బావా " అని చేతులు పట్టుకొని లోనికి నడిచారిద్దరూ.

-" కలరా ? నా మొహమా ?? ఆ వాతావరణానికి ఎవరెళ్లినా అలాగే అవుతారు గాని నీ సంగతేంటి చెప్పు. ఇలా తయారయ్యావ్? బక్క చిక్కావ్. నల్ల బడ్డావ్ . నొసటి మీదున్న జుట్టు ఇంకా ఊడినట్టుందే ? "

-"అంతే అంటావా బావా ? "
అని   అద్దంలో చూసుకుంటూ చెవుల మీద కొచ్చిన వెంట్రుకల్ని ముందుకు చేతితో లాగుతూ సవరించుకుంటూ.. మొహం అటు తిప్పి ఇటు తిప్పి చూసుకుంటున్నాడు సతీష్.

-"చూసుకున్న వరకు చాల్లేరా బాబు "- అని వెనక నుంచి కాలర్ పట్టుకొని లాగి తన రూంలోని సోఫాలోకి నెట్టాడు సతీష్ ని. తను కూడా ఆ పక్కనే ఉన్న మంచంపై కూర్చొని వెనక ఆసరాకి తలగడ పెట్టుకొని సతీష్తో మాట్లాడడానికి  ఉపక్రమించాడు.

-"చెప్పురా సతీష్ అంతా ఓకే కదా ..? ఇంట్లో  అమ్మా , చెల్లీ , తమ్ముడు అందరూ బాగున్నారా ?"

-" బాగున్నార్రా. నువ్వు వచ్చావని నిన్నే లీవ్ తీసుకుందామని అనుకున్నా. నువ్వేమో వద్దన్నావు. ఇవ్వాళ అందుకే ఉదయమే వచ్చేశా వీక్ ఎండ్ కదా. " నవ్వుతూ చెప్పాడు సతీష్.

-"భలే వాడివిరా బాబు. సాయంత్రం అందరం కూర్చుందాం  అని నైతిక్ గాడికి ఫోన్ చేశా. నీకు బోస్ గాడికి కూడా నన్నే చెప్పమని ఫోన్ పెట్టేశాడు ఆ దొంగ డ్యాష్ గాడు."

-"వాడి గురించి నీకు తెలుసు కదరా. ఆరేళ్ళుగా కష్టపడుతున్నాడు. ఈ సారి ఎలా అయినా IPS కొట్టాలని కసి మీదున్నాడు. మమ్మల్ని కలవడం కూడా చాలా తగ్గించాడు. ఈ సారి తీవ్రంగా శ్రమిస్తున్నట్టుంది. " అని చెబుతూ పక్కనే ఉన్న షెల్ఫ్ లో ఆకాశ్  వాడే పెర్ఫ్యూమ్ వాసన చూస్తున్నాడు.

-"కష్టపడక పొతే వాళ్ళ నాన్న ఊరుకుంటాడా?? నేనున్నా డిపార్ట్మెంట్ లో నువ్వు హయ్యెర్ పొజిషన్ తో రావాలి అంటూ చిన్నప్పటి నుంచే వాణ్ని ట్రైన్ చేస్తుంటే. ఉదయం ఫోన్ పెట్టేసేముందు అడిగా వాణ్ని 'సీమ' విషయం ఏం చేసావురా ? అని సమాధానం ఇవ్వలా కొడుకు. సాయంత్రం కలవనీ బొక్కలిరగ కొట్టుడే వానికి" అంటూ సతీష్ వైపు జరిగాడు ఆకాశ్. ఆ మాటలు విని  -'హ .. హ హ .. హ హ హ ..'' అని  గట్టిగా నవ్వాడు సతీష్.

-"ఏంట్రా అంతగా నవ్వావ్ ".

- " లేక పొతే పాపం మనందరం కలసి డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి వాడి మీదే ఆశలు పెట్టుకుంది ఆ పిల్ల. వాడి పీజీ అయ్యి ఇప్పుడు ఆరేళ్ళు. ఆ  అమ్మాయి వాళ్ళింట్లో ఎన్ని మాటలు పడుతుందో. వస్తున్న సంబంధాలన్నీ చెడగోడుతూ ఇన్ని రోజులు ఏదో ఒక సాకు చెప్పింది. తను కూడా సివిల్స్ కోచింగ్లో చేరింది. వాళ్ళింట్లో  వాళ్ళు ఆ అమ్మాయి తిక్క కుదిరే లోపు చిన్నది పెళ్ళికి రెడీ అవుతుందని గమనించి ఒక రోజు పెళ్లి చూపుల్లో ఇద్దరినీ కూర్చోబెట్టారట. చిన్న పిల్లే నచ్చింది అని వచ్చిన వాళ్ళంటే చేసేది లేక ఆ అమ్మాయికి పెళ్లి చేసేసారు. "

-"అవునా ఈ సాయంత్రం నైతిక్ గాడికి నా చేతుల్లోనే మూడింది. యెదవ ముందునుంచీ ఇంతేరా వాడు. అన్నీ సర్కీట్ లెక్కలే చేస్తాడు. "అన్నాడు ఆకాశ్.

ఈ విషయం కన్నా ఇంకా పెద్ద విషయం ఏదో ఉంది అన్నట్టు ఆకాశ్ మొహానికి దగ్గరగా తన మొహం తెచ్చి -"అవునురా నీ ఫేస్ బుక్ లో ఫోటోలు చూసా ఆ మధ్య ఎవరో అమ్మాయితో. ఆ అమ్మాయి ఎవరు?. నువ్వు కూడా వానిలా షాక్ ఇవ్వవు కదా ? ఆ బోస్ గాడి దెబ్బకు ఇంకా కుదురుకోలేదురా బాబు నేను అసలు " అని విషయం అడిగాడు సతీష్.

-" నేనా బోస్ లాగానా " అని ఆకాశ్  నవ్వడం మొదలు పెట్టగానే సతీష్ కూడా ఆ నవ్వులతో తన నవ్వులు కలిపాడు. పొట్ట చెక్కలయ్యేలా ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. బోస్ పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ.

-" అలాంటిదేం లేదురా సతీష్ తను నా కొలీగ్ అంతే . కాక పొతే కొంచెం చనువు ఎక్కువ. తెలుగొణ్ని కాబట్టి. అమ్మాయి మంచిదే కాని నాకు కావలసిన సుగుణాలన్నీ లేవు అందుకే ...  " అని సాగదీస్తూ మాటలు ముగించాడు ఆకాశ్ .

-" నీ సంగతేందిరా?  చెల్లి పెళ్ళికి అంత కష్టపడకుండా  నాకు అట్లీస్ట్  ఒక ఫేస్ బుక్ మెస్సేజ్ ఇవ్వచ్చు కదా. లేదా  ఒక ఫోన్ కాల్. నువ్వెప్పుడూ ఇంతేరా అస్సలు. కొంచెం కూడా మనోళ్ళు అని అనుకోవు. " అంటూ తన పక్కనున్న తలగడ తీసుకొని సతీష్ తలపై కొడుతూ అడిగాడు ఆకాశ్ .

-"నువ్వు నాకు బయటోడివేందిరా బాబు ? నువ్వక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటావో తెలియదు. ఎందుకు నిన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయడమని చెప్పలేదు. అనుకుంటూ లేచి గది మూలలో ఉన్న బల్లపై ఉన్న మంచి నీళ్ళ సీసా తీసుకొని వచ్చి కూర్చిని మెళ్ళిగా నీళ్ళు తాగాడు సతీష్.

చెల్లి విషయం గుర్తు చేయగానే ఎందుకో డల్ అయ్యాడని గ్రహించాడు ఆకాశ్. నీళ్ళు తాగడం అవగానే తానే నెమ్మదిగా చెప్పడం మొదలు పెట్టాడు సతీష్. - " మంచి సంబంధం. పెళ్లి చేసేయొచ్చు అని వచ్చిన చుట్టాలందరూ తలా ఓ మాట అని వెళితే, పీ. జీ చదువుతాను అని అన్నా వినకుండా పెళ్లి చేశాం. తమ్ముడి చదువు భాద్యత కూడా నాదేగా అమ్మేమో - ' ఎందుకురా అదంత చదువుకుంటానని వాళ్ళ అత్త వాళ్ళను ఒప్పిస్తే వాళ్ళే చదివిస్తారు. రెందేల్లయితే తమ్ముడు ఇంజనీరింగ్ కోసం  సిద్ధపడతాడు. నీకు కష్టం అవ్తుంది. ' అని కన్నీరు పెట్టుకుంది. నాన్న పోయాక వచ్చిన డబ్బు కొంత బ్యాంకులో ఉంది కదా, అది అలాగే నేను లోనికి అప్లయ్ చేశా ఆ మొత్తం కలిపి ఒక పదిలక్షలు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశా".. కానీ .. కానీ అని తలకిందకేసి సన్నగా నిట్టూర్చాడు సతీష్.

వెంటనే భుజం మీద చేయేసి కదుపుతూ - " హా ఏమైందో చెప్పు రా ?? ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా ? " అంటూ అడిగాడు ఆకాశ్ . గుండెల నిండా గాలి పీల్చుకొని చెప్పడం మొదలుపెట్టాడు సతీష్. - " పెళ్ళైన  రెండునెలల తర్వాత చెల్లిని ఇంటికి పంపాడు.  కారు కొనుక్కొని ఇంటికొస్తేనే మళ్ళీ రా. లేకపోతే తెచ్చేవరకు అక్కడే ఉండు అని. నాన్న మాకిచ్చిన ఆస్తి మేముంటున్న యిల్లే నీకు తెలుసుగా తమ్ముడి చదువు కోసం దాచుంచిన డబ్బుకొంత.  మళ్ళీ లోన్ తీసుకొని కార్ కొని పంపాం. పెళ్ళైన మూడో నెలే తను నెలతప్పింది. శ్రీమంతం అదీ ఇదీ ఎలాగో కానిచ్చాం. కాని వాళ్లత్త , ఆ అబ్బాయి మగపిల్లోడైతే సరి లేక పోతే ఏం జరుగుతుందో చూపిస్తాం అంటూ వేధింపులు , దబాయింపులు. ఇప్పుడు ఏడో నెల దాని మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో B.P ఫ్లక్చుయేట్  అవుతుంది. నాకేమో ఈ ఆగస్ట్ లో అప్రైసల్ ఉంది. మేనేజర్ పొజిషన్ వస్తుందేమోనని రాత్రింబగళ్ళు కష్టపడ్తున్నా రేటింగ్ కోసం ".. హ్మ్మ్ ఇదీ నా కథ నిన్ను విసిగించాను కదా సారీ.

-" అవున్రా బాబు చాలా విసిగించావ్ నోరుముయ్యి భే. ఇలాంటి సమయాల్లో కాకపొతే ఎప్పుడ్రా స్నేహితులు. కాని ఈ మధ్య ఆడపిల్లల పరిస్థితి ఆలోచేస్తేనే నాక్కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకురా ఇలా కొంత మంది మగవాళ్ళ వల్ల మనందరం చెడ్డపేరు మోయాల్సి వస్తుంది. మొన్న అమెరికాలో ఉన్నప్పుడు కూడా అదే ఆ అమ్మాయి ఫోటోలో ఉందే ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని కూతురునైతే ఏకంగా అత్తింటివారు చంపేశారని. అందరూ మామూలు చావే అనుకున్నారు ఇక్కడినుంచి దీప్తి ఫోన్ చేసి చెప్పే వరకు తెలియలేదు హత్య అని. దీప్తి వాళ్ళ కజిన్ ఎప్పుడూ తనతో షేర్ చేసుకునేదట లేక పొతే తెలిసేది కాదు.  పాతిపెట్టి మూడు రోజులయ్యాక శవానికి పంచనామా చేసారు. అప్పుడు హత్య అని నిర్ధారణ అయ్యింది.  ఆ రోజు దీప్తి ఏడుస్తూ - " ఎందుకు ఈ మగవాళ్ళందరు  ఇలా ఉంటారు? అమ్మలు చెప్పింది విని డబ్బు కోసం పెళ్లి చేసుకున్న భార్యనే చంపేస్తారా ?? అత్తలైనా ఒకప్పటి కోడళ్ళే అన్న విషయం మర్చిపోతారా ?? " అని అడిగిన ప్రశ్నలు నాకు ఇంకా గుచ్చుకుంటూనే ఉన్నాయిరా.
- " చూడు అంటూ లాప్ టాప్ తెరిచి స్త్రీలపై జరిగే అత్యాచారాలు .. బ్రూణ హత్యల గురించి ఇద్దరు చర్చించుకున్నారు.

మాటల్లో టైం  అయిదు కావచ్చింది. బోస్ , నైతిక్ ల దగ్గర నుంచి ఫోన్. - " మేం బయలు దేరుతున్నాం రా ఆకాశ్. అర్ధ గంటలో నీ ముందుంటాం " అని ఫోన్ కట్ చేసారు.

                                                           *   *    *    *    *   *    *

-"అరేయ్  ఆకాశ్ ఎలా ఉన్నావ్ రా ?? అని బోస్ ఆకాశ్ ని కౌగలించుకున్నాడు.  -" వీడికేంట్రా  హీరో అని నైతిక్ షేక్ హ్యాండ్ ఇచ్చి  భుజమ్మీద చెయ్యేసి దగ్గరగా లాక్కున్నాడు. "

" ఏంట్రా బోస్ , నైతిక్ గాడి సంగతి తర్వాత చెబుతా ముందు నీ సంగతి చెప్పు.  చెప్పాపెట్టకుండా లవ్ ఎప్పుడు నడిచింది ?? పెళ్లెలా ఫిక్స్ అయ్యింది ??. మీ నాన్నని ఎలా మ్యానేజ్ చేసావ్ ? మొత్తానికి పెళ్లై ఆరునెలలైనా అవ్వడం లేదు. అప్పుడే బెలూన్ లా ముందుకొచ్చింది పొట్ట. అంకుల్ అయిపోయావ్రా నువ్వు " అంటూ నవ్వుతూ వాళ్ళు తినడానికి తెచ్చిన స్టఫ్  లోంచి చిప్స్ తీసుకొని తింటూ నైతిక్ ని తన మోచేతితో పక్కలో పొడిచాడు.

"ప్రొడ్యూసర్ కష్టాలు ప్రొడ్యూసర్ వి , హీరోయిన్ కష్టాలు హీరోయిన్ వి అన్నట్టు ఉందిరా ఇప్పుడు పరిస్థితి. మీకేం ఇంకా పెళ్లి వయసు రానట్టు బిల్దప్పులిస్తున్నారు. చూస్కోండి ఇంకో సంవత్సరం ఆగితే ఏ అమ్మాయి మీ వైపు అబ్బాయిల్ని చూసినట్టు చూడదు అంకుల్ కొంచెం పక్కకి జరగండి అనకపోతే " అంటూ షర్టు చేతుల్ని పైకి మడిచి ఇన్ షర్ట్ తీసేస్తూ -" ఏం చేస్తాం ? ఇంట్లో వాళ్లకు నచ్చే వేషాలు బయటవేయలేం కదా"  అని సతీష్ పక్కన కూర్చున్నాడు.

-" అవునవును వీడు ఆ అమ్మాయిని లేపుకోలేని సాంఘిక టెంపుల్ దగ్గరకొచ్చి, నన్ను ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని పిలిచే వరకు తెలియలేదురా  వీడి కతలు ఆ పిల్లేమో - 'అన్నయా ఈయన్ని చేసుకోకపోతే నేను చచ్చిపోతా నంటుంది" ఆ ఇంట్లో ఆ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారంటూ . వాళ్ళ నాన్న భయంతో వాడు అన్ని రోజులు ఆగినా ఆ పిల్ల పెళ్లి ఫిక్స్ అయ్యాక ధైర్యం తెచ్చుకున్నాడు. " అంటూ సతీష్ చెబుతున్నంతలో నైతిక్  అందుకొని
- " వీడు ధైర్యం తెచ్చుకోవడమేందిరా సామి ఆ పిల్లే వీడికి ధైర్యం నూరి పోసింది. లేకుంటే వీడి మొఖానికి వాళ్ళ నాన్నకు ఎదురు నిలబడతాడా ?? ఆ రోజు గుర్తుందా వీడు మూవీ ఫీల్డ్ అంటే వాళ్ళ నాన్న ఏం చేసాడో?. " అనగానే ఆకాశ్ , సతీష్ కలిసి నవ్వారు.

-"సరే సరే లేవోయ్ నేనైనా అటో ఇటో చేసి పెళ్లి చేసుకున్నాను. నువ్వుబే  మరి. పాపం ఆ పిల్ల 'సీమ' ఇంకా నీ కోసం చూస్తుంది. దేవతరా ఆ పిల్ల. అట్లా ఎదురుచూసే పిల్లలు ఇయ్యాళ రేపు ఎక్కడుంటార్రా ??'' అరేయ్ అదేదో క్లాస్ పీకుతా అన్నావ్ గా ఇక మొదలు పెట్టు ఆలస్యమెందుకు? కెమెరా , లైట్స్ , యాక్షన్ అని అనడం గురించి చూస్తున్నట్టున్నాడు వాడు. వాడు వాడి మొహం. చూడు " అని నైతిక్ గడ్డం పట్టుకుని పైకిలేచాడు.

-"సీమ విషయం దేశ భద్రతకు సంబంధించి కాదుకాని వేరే విషయాలు ఏమైనా ఉంటే అవి మాట్లాడండిరా ప్రస్తుతం అది పక్కన పెట్టండి ప్లీజ్ " అని సోఫా పై నుంచి లేచి మంచంపై రెస్ట్ తీసుకోడానికి ఒరిగాడు.

                                                          *  *   *   *   *   *  *

-" నైతిక్ బీర్ తాగుతావా ఇదో" అంటూ బయటికెళ్ళి సతీష్ తెచ్చిన బీర్ బాటిల్స్ కొన్ని పర్సనల్ ఫ్రిజ్లో పెట్టాడు ఆకాశ్.

-" ఎప్పుడూ వద్దు , వద్దు అంటూ నాటకాలాడే వాడురా. వీడు ఇవ్వాళ ఒక్క మాట నువ్వు అడగ్గానే ఎట్ల ఉషార్ అయ్యిందో చూడు అంటూ" సతీష్ ని చూసి కన్ను కొట్టాడు బోస్. సమాధానంగా నవ్వాడు సతీష్.

ఒక బీర్ తాగాక మెళ్ళగా - " ప్రాణంలో ప్రాణంగా , మాటల్లో మౌనంగా చెబుతున్నా.. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళ్తున్నా.. మొన్న కన్న కల , నిన్న విన్న కధ రేపు రాదుకదా జతా.." అంటూ పాడుతూ టెర్రస్ పైన ఓ మూల పిట్టగోడ ఎక్కి కూర్చున్న నైతిక్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు ఆకాశ్ - " ఏంట్రా ప్రాబ్లెమ్ ?!, ఎందుకు ఆ అమ్మాయిని అలా అవాయిడ్ చేస్తున్నావ్ ??" అని అడిగాడు.

-" ఎం లేదురా సీమంటే నాక్కూడా చాలా ఇష్టంరా !! కాని ఏం చేయాలి ఒకవైపు నాన్న ప్రెషర్. ముందే ఈ  సర్వీసస్ కి సిద్ధపడటం కుదరట్లేదు అని వదిలేస్తే వేరే కరియర్ , వేరే జీవితం ఉండేది. ప్రతి సంవత్సరం రిజల్టు చూసుకుని నిరుత్సాహ పడడం. ప్రిలిమ్స్ వరకి వెళ్లి మెయిన్స్ లో వెనక్కి రావడం ఒక ఎత్తైతే , మెయిన్స్ వరకు వెళ్లి కూడా ప్రూవ్ చేసుకోలేదేంటి అన్న బాధ ఇంకొక వైపు. అమ్మా నాన్న అందరికి మా వాడు ఎలా అయినా IPS అయితీరుతాడని ప్రతి చుట్టానికి , దారిన పోయే వానికి , ఇంటి చుట్టుపక్కలోల్లకి చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు నేను కనిపిస్తే గౌరవంగా చూస్తే మరి కొందరు జాలి గా, వెటకారంగా చూస్తూ హాస్యంగా మాట్లాడడం నాకు బాధేస్తుందిరా. అందుకే ఎవ్వరికీ కనబడకుండా ఒక్కన్నే ఉంటున్నా. ఇక సీమ పరిస్థితి అంటావా? అది పిచ్చిదిరా .. చాలా చాలా మంచిది .. నేను నా కెరియర్ లో సెట్ అవ్వకపోతే దాన్ని బాగా చూసుకోలేను. ఆ పిల్ల లైఫ్ పాడు చేసినట్టవుతుంది. నాన్న ఇప్పటికే చాలా డబ్బు నా చదువు కోసం , కోచింగ్ కోసం ఖర్చు పెట్టాడు.   నేను IPS ఆఫీసర్ అయితే అదంతా కట్నంగా లంచాలుగా రాబట్టొచ్చని ఆయన ఆలోచన. కాని ఆకాశ్ నేను కాని ఈ సారి IPS సెలెక్ట్ అయితే మొదట చేసే పని సీమ ని పెళ్లి చేసుకోవడమేరా.. ఐ రియల్లీ లవ్ హర్ రా .. ఐ మిస్ హర్ అలాట్ " అంటూ ఏడ్చేసాడు నైతిక్ .

-" హే నైతిక్ బాధ పడకురా .. లుక్ .. లుక్ ఎట్ మీ .. దిస్ టైం యు ఆర్ గోయింగ్  టు రాక్ మ్యాన్ .. సక్సెస్ ఈస్ యువర్స్ " అని ఆకాశ్ దగ్గరకి తీసుకుంటే - " నువ్వు నిజంగా మాయామచ్చింద్రా వి రా " అని బోస్ అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు.

-"ఇదంతా సరేగాని ఆకాశ్ , అందరి గురించి అడుగుతున్నావ్ . పెళ్ళిళ్ళ గురించి ఇంత ముచ్చటపెడ్తున్నావ్. ఇంతకు నీ పెళ్లి సంగతి మాట్లాడవేంది బావ ?? ఎవ్వరినైనా ప్రేమించావా ?? అదే ఇష్క్ , కాదల్ లవ్ లాంటిది అయ్యిందా ?? లేక అరేంజ్ మ్యారేజ్ కే సై అంటావా ?? " అని అడిగాడు బోస్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ సిప్ చేస్తూ..

-" లవ్వ్ .. అలాంటిదేం లేదు గాని, అమెరికా వెళ్ళాక అర్ధమైందిరా మన సాంప్రదాయాలున్న పిల్ల దొరకడం ఎంత అదృష్టమో అని. కష్టపడి ఇంటికొచ్చిన భర్తకు సంధ్యా సమయంలో భూమిని చల్లగా వెలిగించే చంద్రునిలాంటి నవ్వుతో , ఉదయాన్నే పూలపై పడ్డ మంచుబిందువుల్లాంటి మాటలతో .. ప్రక్కనే నా నీడగా , తోడుగా నడుస్తూ నా లో  నిత్య వసంత రుతువుగా ఉండాలి. ఎక్కువగా ఆశిస్తున్నా కదూ .. ?!. ఉదయాన్నే అమెరికాలో వాకింగ్ కి వెళ్ళేప్పుడు వాకిళ్లో ముగ్గేసే ఆ అమ్మాయి కనిపించేదిరా. తెలియకుండానే ఎందుకో , ఆహ్లాదంగా , ప్రశాంతంగా .. ఆ రోజంతా అందంగా గడిచేది. " అని చెబుతున్నంతలో సతీష్ కి పొరమారింది. - " ఏంటి ముగ్గేసే అమ్మాయా ?? అబ్బాయ్ హోటల్ దగ్గర అమ్మాయి గురించేనా నువ్వు మాట్లాడేది ? " తను విన్నది నిజమేనా అని ధ్రువపరుచుకోడానికి అడిగాడు సతీష్. చాలా మెళ్లిగా ఒక్కొక్క పదం విడదీస్తూ. బోస్ నైతిక్ ఇద్దరూ తాగడం మానేసి ఒక్కసారి ఆకాశ్ వైపు కొత్తగా చూసారు .

" అవున్రా ఆ అమ్మాయే . దీపావళి కాంతి అంతా ఆ అమ్మాయి ముఖంలోనే దాగున్నటనిపిస్తుంది. నన్ను ఓరకంట చూసేప్పుడు కావాలనే నేను పట్టించుకునే వాణ్ని కాదు. తను ఆ వేళ్ళతో ముగ్గు పెట్టేప్పుడు నా గుండెపై ప్రతి రోజు కృష్ణశాస్త్రి కవితేదో రాస్తున్నట్టు, ఆ కవితలోని భావుకతతో నన్ను ఆకర్షిస్తున్నట్టు అనిపించేది. తలంటు పోసుకొని కట్టుకున్న టవల్ ముఖంపై పడే ముంగురులు నన్ను పిలిచి సరి చేయమనేవి.  ముగ్గుపెడుతూ అటూ ఇటూ దాటుతూ వేసే పాదాలు వాటితో వచ్చే పట్టీల శబ్ధం నన్ను చేయి పట్టుకొని ప్రక్రుతి ఒడిలోకి నదిపించుకెళ్లె నండూరి ఎంకిలా అనిపించేది. ఇక్కడున్నని రోజులు పట్టించుకోలేదు. గాని ' యు .ఎస్ ' వెళ్ళాక ఆ అమ్మాయితో ఒక్కసారైనా మాట్లాడాలనిపించేది. తన పేరైనా తెలుసుకోమని మీకు పురమాయించాలనిపించేది. మళ్ళీ మీరు నన్ను గేళి  చేస్తారని చెప్పలేదురా.  కాని నేను' యు . ఎస్ ' వెళ్ళే ముందు రోజు తను నన్ను చూసిన చూపులు , కనిపించకుండా నా వరకు పంపిన నవ్వు నా హృదయంలో నాటుకుపోయాయిరా. " అని మాట్లాడుతూ వారి వైపు చూసాడు. తాగకుండా అక్కడున్న స్టఫ్ కూడా తినకుండా ఆ ముగ్గురు స్నేహితులు ఆకాశ్ వైపు  కన్నార్పకుండా చూస్తున్నారు.

" అరేయ్ బోస్ ఏంట్రా అలా దిష్టి బొమ్మను చూసినట్టు చూస్తున్నారు. నేను నార్మల్ గా ఉన్నా మీరెందుకు ఇంత అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు ?" అని అడిగాడు ఆకాశ్.

-" ఏం లేదు బావా నేను తాగిందంతా దిగిపోయింది. నాకిప్పుడు ఇంకో బీర్ కావాలి." అని బోస్ కూర్చున్న దగ్గర నుంచి లేచి నిలబడ్డాడు. - " నాక్కూడా .. నాక్కూడా రా "  అంటూ సతీష్ , నైతిక్ కూడా అనే సరికి ఆకాశ్ కి ఏమర్ధమవలేదు . సరే నేను తెస్తాను మీరుండండి అని ఈల వేస్తూ ఉత్సాహంగా ఢాబా దిగి వెహికల్ తీసుకొని
వెళ్తుంటే ముగ్గురు పైనుండి ఆకాశ్ వైపే చూస్తూ నిలబడ్డారు.

                                                      *   *    *   *    *    *   *   *

బీర్ బాటిల్స్ తో ఆకాశ్ వచ్చేప్పటికి ముగ్గురూ ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు. - " జరిగిన విషయం ఆకాశ్ గాడికి చెప్పొద్దు. తెలియనీయొద్దు. ముఖ్యంగా అరేయ్ బోస్ నువ్వు. నువ్వు గాని నోరు విప్పావో నా చెఉత్ల్లొ నీకు మూడింది అంతే. " అంటూ సతీష్  వార్నిగ్ ఇస్తుంటే వింటూ పైకొచ్చాడు. తలా ఓ బాటిల్ అందుకొని ఏమీ మాట్లాడకుండా తాగుతుంటే వాళ్ళ ప్రవర్తనపై ఆకాశ్ కి అనుమానమొచ్చింది.

- " ఏంట్రా అందరూ అలా సైలెంట్ గా ఉన్నారు. అంతా ఓకే  కదా " అడిగాడు ఆకాశ్

-" హా ఓకే బావా .. అంతా  ఓకె .. ఎవ్రీతింగ్ ఈస్ ఆల్రైట్ అన్నాడు బోస్ .

" ఒరే బోస్ నువ్వు నోరు మూస్తావా ? ? చాలా ఎక్కింది నీకు ఇక వెళ్దాం " అన్నాడు నైతిక్  .

-" ఏంట్రా నా పెళ్లి ప్రస్తావన  చెప్పగానే ఇలా చల్లబడ్డారు.  మీ అందరికీ షాక్ ఇచ్చాను కదా  అని కొంచెం సిగ్గుపడుతూ నవ్వాడు ఆకాశ్ .

" బావా నిజంగానే షాక్ ఇచ్చావ్ బావా నువ్వూ .... తాగి మత్తుగా మాట్లాడుతూ బోస్ . నువ్వు మంచి దిల్ ఉన్నోడివి బావా . నువ్వెప్పుడు  కుష్ ఉండాలే . హ్యాపీగా ఉండాలే . " అని బోస్ అన్న మాటల్లో ఏదో వీళ్ళు దాస్తున్నారని  చూచాయగా అర్ధమయ్యింది.

-" రేయ్ బోసు నీకు పగిలిపోద్ది . ఇక జోకులాపు కన్నా .." అని రాణి నవ్వు మొహంపై తెచ్చుకున్న సతీష్ ఏదో దాస్తున్నాడని ఆకాశ్ కి అర్ధం అయ్యింది.

" సతీష్ నిజం చెప్పు ఏమయ్యింది? ఏదో దాస్తున్నారు. నేను వచ్చేప్పుడు నువ్వు బోస్ గాడికి వార్నింగ్ ఇవ్వడం నేను చూసాను" అని ఆకాశ్  కూర్చున్న దగ్గర నుంచి లేచి నిల్చున్నాడు.

-" బావా అదీ.. అదీ .. ఏమయ్యిందంటే "అన్నాడు నైతిక్ ..

-" ఏమయ్యిందో చెప్తారా నాకు కోపం రాకముందే" అని మళ్ళీ తన స్థానానికి వచ్చి కూర్చున్నాడు ఆకాశ్.

" కొద్దిగ్గా మత్తెక్కిన మాటలతో నేను చెప్తా బావా .. " అంటూ ముందుకు ఆకాశ్ కి దగ్గరగా జరిగి ఆకాశ్ కుడికాలు పట్టుకొని - " ఆ అమ్మాయి .. అదే ఆ ముగ్గమ్మాయి సునీత చనిపోయింది బావా " అని మత్తులో బాధగా చెప్పాడు బోసు.

-" అక్కడికక్కడే భూగోళం భ్రమించడం ఆగిపోయినట్టు , గాలి వీయకుండా శిలలా మారినట్టు , నెత్తిపై చీకటి విరిగి దబీమని పడి ఊపిరాడనట్టు అనిపించింది ఆకాశ్ కి .

పరిస్థితి గమనించి విషయాన్ని చెప్పడం తన పనిగా స్వీకరించాడు సతీష్ - " అవున్రా బావా . ఆ అమ్మాయి చనిపోయింది . ఆ అమ్మాయి చనిపోవడం వెనక పెద్ద కధే ఉంది. " అని కూర్చున్న స్థలంలో తన ముఖంపై పడుతున్న లైట్ వెలుతురు నుంచి తప్పుకొని చీకటిగా ఉన్న వైపు నడుస్తూ చెప్పడం మొదలు పెట్టాడు సతీష్ .

-" అవును బావా ఆ అమ్మాయి చనిపోయింది. నిర్దాక్షిణ్యంగా చంపబడింది అనడం బాగుంటుందేమో... !! నువ్వన్నది నిజమే బావా మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదూ ఆ ముగ్గేసే అమ్మాయి గురించి ఆ రోజే నువ్వన్న మాటలని బట్టి నీకు ఆ అమ్మాయి మీద సాఫ్ట్ కార్నర్ ఉందని అర్ధమయ్యింది. నువ్వు అమెరికా వెళ్ళిపోయాక ఒక రోజు ఉదయం నేను, నైతిక్ , బోస్ గాడు కాఫీ తాగడానికి వెళ్లాం. మనం ఎప్పుడూ కూర్చునే స్థలంలో కూర్చొని మాట్లాడుతున్నాం. ఎప్పటిలానే ఆ అమ్మాయి ముగ్గేసింది. ఎప్పుడూ తిరిగి చూడనిది కొద్ది సేపు నిల్చుని చూసింది. నాకెందుకో నీ గురించి వెతుకుతుంది అనిపించింది. సరిగ్గా వారం రోజుల తర్వాత నైతిక్ గాదు నేను కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు ముగ్గేసేది ఆపి వచ్చి నీ గురించి అడిగింది. నువ్వు ఆన్ సైట్ వర్క్ పై అమెరికా వెళ్ళావని చెప్పాం. నేలకు ముఖమేసుకొని ఆ ముగ్గు వేసేసి ఇంట్లోకెళ్ళింది. కొన్ని రోజులయ్యాక ఆ ఇంటి ముందు పెళ్లి పందిరి కనిపించింది. అబ్బాయ్ హోటల్ యాదిగాడు చెప్పాడు -" సునీత మేడం పెళ్లి ఇంకో రెండు రోజుల్లో, వాళ్ళ నాన్న చెప్పాడు . పెళ్లి కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్ " అని.

- " పోలీస్ ఇన్స్పెక్టరా ? " సతీష్ ని ఆపి అడిగాడు ఆకాశ్.

-" పోలీస్ ఇన్స్పెక్టరే . ఆ తర్వాత నాలుగు నెలలకే ఆ ఇంటిముందు ఆ అమ్మాయి శవం. తరువాత రోజు న్యూస్ పేపర్లో ఆ అమ్మాయి ఆత్మ హత్య ఉదంతం గురించిన కథనం చూపించి TRP పెంచుకున్న న్యూస్ చానెళ్ళు "

" ఏం రాసిందిరా సూసైడ్ నోట్ లో తను " బాధగా అడిగాడు ఆకాశ్.

" అది సూసైడ్ నోట్ కన్నా ఆ అమ్మాయి తన అమ్మా , నాన్నలకు రాసిన ఉత్తరం.
అమ్మా , నాన్న .. !
నాకు పెళ్లి వద్దు అంటున్నా మంచి సంభందం అని పెళ్లి చేశారు. ఒక్క రెండేళ్ళ తర్వాత చేసుకుంటానని అప్పటివరకు ఏదో ఒక కోర్సులో చేరతానని చెప్పినా నిర్దాక్షిణ్యంగా కుదరదన్నారు. మీకున్న రీసన్స్ మీకున్నాయి నాకు తెలుసు. మీ మనసు మారదని తెలిసి నన్ను నేను ఒప్పించుకొని , సర్ది చెప్పుకొని మీ కోసం , కేవలం మీ కోసం మాత్రమె ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. కాని పెళ్ళయ్యాక ఈ నరకం భరించలేక పోతున్నానమ్మ . బ్రతకాలని లేదమ్మా  .. ఇతను నన్ను బ్రతకనీయడం లేదమ్మా... పెళ్లి ముందు రోజే నాకు ఒకరిపై ఉన్న ప్రేమను అనచివేసుకొని , తుడిచివేసుకొని పవిత్రంగానే పెళ్ళికి సిద్ధపడ్డాను. పెళ్ళయిన వారం తరువాత తన గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఫేస్ బుక్ లో కొంత మందిని చూపించాడు. నీకు కూడా డిగ్రీలో , పీజీలో బాయ్ ఫ్రెండ్స్ కాకపోయినా , అభిమానించిన వాళ్ళు ఎవరూ లేరా అని అడిగాడు. అన్యోన్యంగా ఉండడంలో తప్పు లేదు కదా అని నా వన్ సైడ్ లవ్ గురించి చెప్పా. అతడి పేరు ఆకాశ్ అని నాకు తన గురించి తెలుసు గాని తనకు నేను నా పేరు కూడా తెలియదని చెప్పాను. కాని తను నమ్మలేదమ్మా. రోజు కొట్టే వాడు, హింసించే వాడు.. ఆకాశ్ పేరు చెపుతూ నా అంగాంగం స్పృశిస్తూ ఎలా ఉందొ చెప్పమని హింసించాడు. నన్ను బాగా చూసుకుంటాడని ఈ రాక్షసుడి కిచ్చారు. రక్షణ కోసం బయటికి వెళ్ళలేని పరిస్థితి. నేను చెప్పినా ఎవరూ నమ్మరని తెలుసు. ఎందుకంటే తన డిపార్ట్మెంట్ లో తను అంత మంచి నటుడు. రోజు రోజు నరకం పెరిగిపోయిందమ్మా .. పాల వాడితో , పేపరు పిల్లోడు, కూరగాయల వాడితో ఎవ్వరినీ వదలకుండా సంభందం అంతకట్టి చిత్రవధ చేస్తున్నాడు. మానసికంగా నన్ను చంపేసాడు. నాకు బ్రతకాలని లేదు. మీ దగ్గరకి వచ్చేద్దాం అనుకున్నా మీకు పరువు, మీ బాధ్యతలే ముఖ్యం కదా నాన్న . ఒక రెండు రోజులు ఇంటికొస్తా నని నేను అడిగినా ఏ  రోజు నువ్వు నన్ను తీసుకెళ్లడానికి రాలేదు. ఏమో వచ్చుంటే మీతో నా భాధలు పంచుకునేదాన్ని. నా మరణానికి అతడే బాధ్యుడో మీరు బాధ్యులో మీరే తేల్చుకోండి . ఇక ఈ జీవితానికి సెలవు. " అని ఉందిరా అంటూ సతీష్ చెప్పడం ముగించాడు.

కొద్ది సేపు వాళ్ళున్న వాతావరణం అంతా ఘనీభవించింది. ఎవరి దగ్గరా మాటలు లేవు. కూర్చున్న స్థలం నుంచి లేచి  వీధి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ నిల్చున్న ఆకాశ్ భుజంపై చేయెసి - " ఆకాశ్ హాప్ యు విల్  ఫైన్ బావా " అన్నాడు నైతిక్.

దాచిపెట్టినా దాగని కన్నీళ్లు. తన కళ్ళలో తనని అంతగా ప్రేమించిన అమ్మాయి కళ్ళను తాను  పసిగట్టలేక పోయానే అన్న బాధ. మెళ్లిగా వెనక్కి తిరిగి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాడు.

- " ఎన్ని రోజులురా .. ఇంకెన్ని రోజులు ? ఇలా అమ్మాలని మనమే చంపుకుందాం ?? ఒకవైపు కట్నం కోసం ఒకడు. మరో వైపు ఆడ పిల్ల అని తెలియగానే కడుపులో భ్రూణ హత్యలకు పాల్పడే వాడొకడు, సమయం దొరికితే పిచ్చి బూతు జోకులేసుకోడానికి అమ్మాయిల్ని సెక్స్ బొమ్మలుగా చూసేవాడొకడు...  ఇంకెప్పటి వరకురా ఇలా?? పని కై  బయటి కెళ్ళే అమ్మాయి వచ్చే వరకు నమ్మకం లేదు. బహిర్భూమి కై వెళ్లి అత్యాచారాలకు గురై చంపబడ్ వారిపట్ల న్యాయం లేదు. ఈ వ్యవస్థ మీద , కొన్ని సార్లు మానవజాతి మీద కూడా కోపం వస్తుంది. అనుమానమా ?? ఏనాడు పల్లెత్తు మాట మాట్లాడని ఆ పిల్లపై అంత దౌర్జన్యపూరిత హింసనా? కూతురు ఇంటికొస్తా అంటే కూడా వినని తల్లిదండ్రులు ఉండి ఏం లాభం రా. ?? పాములను చూపించి , పిచ్చి భయాలను కల్పించి  లొంగదీసుకొని వీడియోలు తీస్తున్నాబయటికి రాని నిజాల చీకట్లలో మగ్గే స్త్రీలు ఎందఱో . వాళ్లకు సంఘం , సమాజం ధైర్యం చెప్పడం కాదురా కుటుంబమే అండగా నిలబడడం లేదు. కుటుంభమే వారి మాట విననప్పుడు బయట ఏ కోన్ కిస్కా గొట్టం గాడెవడో ఎందుకు వింటాడ్రా?? ఎందుకు వింటాడు? అని చెంపపై జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ..  -'" అరేయ్ సతీష్ ఢిల్లీ లో మనం చూసిన అస్మిత థియేటర్ గ్రూప్ ని రేపే కాంటాక్ట్ చేద్దాం. పెద్ద మార్పు కోసం, ఈ సమాజ రుగ్మత బాగు చేసేందుకు  మన వంతు ప్రయత్నం మనం చేద్దాం .. వీధి నాటకాల ద్వారా జనాలను జాగృత పరుస్తున్న అస్మిత గ్రూప్ ని మనం ఇక్కడ ఫార్మ్ చేద్దాం . నేను ఇక అమెరికా వెళ్ళను ". అంటూనే తన కన్నీటిని తుడుచుకున్నాడు ఆకాశ్... ఎంత తుడుచుకున్నా కన్నీరు ఆగదే..

కన్నీళ్లు ఇంకా కళ్ళను ముంచెత్తుతూనే ఉన్నాయ్. మెళ్లిగా నడచి పిట్టగోడ దగ్గరకి వచ్చి నిల్చున్నాడు. కింద ఆడకుక్క వెంటపడుతూ భయపెడుతున్న మగకుక్కను చూసి పక్కనే ఉన్న రాయి తీసుకొని ఆ కుక్కపైకి విసిరాడు. ఆ వెనకే తన స్నేహితుల ముగ్గురి చేతులు తన భుజంపై పడ్డాయి మేమున్నాం అంటూ.