Monday, January 21, 2013

ఇది నిజం సందేహపడొద్దు (by mercy margaret)
-------------------------------------
యాత్రికుని లా వచ్చి ఒక వ్యక్తి  ఎడారిలో తప్పిపోయాడు . ఉదయం నుండి ఆ ఎడారిలో నాలుక అంగిలికి అంటుకు పోతుంటే  ఎటు వెళ్ళాలో తెలియక అల్లల్లాడుతూ తిరిగుతూనే ఉన్నాడు.సూర్యుడు తన పని తాను చేసుకుపోతున్నట్టు నడి నెత్తిపైకి ఎక్కి ,మిట్ట మధ్యాహ్నం ఇలా ఉంటుందని చూపిస్తున్నాడు .గొంతు ఎండిపోతుంది గుక్క నీటి కోసం వెతుకుతూ ఆ ఎడారిలో నడవలేక భారంగా నడుస్తూ జీవితపు చివరి క్షణాలా అన్నట్టున్న సమయాన్ని అడుగులతో లెక్కించుకుంటున్నాడు .
ఇలా దాహంతో అల్లల్లాడుతూ దారి తప్పిపోయి ఎడారిలో తిరుగుతున్న తనకి దూరంగా పాడైపోయి , బాగు చేస్తూ వదిలేసినట్టున్న బోరింగు (తొలుపుడు యంత్రం /బోరు )కనిపించింది .నాలుకను లాగి నరనరాలకు దాహం ,చావు రుచి చూపిస్తున్న ఎండలో పడుతూ లేస్తూ మొత్తానికి ఏదోలా ఆ బోరు వరకు చేరుకున్నాడు ఆ వ్యక్తి .అక్కడ చిన్న జగ్గులో నీళ్లతో పాటు బోరింగుపైన ఇలా రాసి ఉంది.-" ఈ జగ్గు లోని నీళ్ళు ఈ బోరింగులోకి ఒంపి మెళ్లిగా కొడుతూ ఉండండి కావాల్సినన్ని నీళ్ళోస్తాయి" అని -
ఆ మాటలు చదివి ఆలోచనల్లో పడిపోయాడు ఆ వ్యక్తి .
-నీళ్ళు ఆ బోరు పంపులో ఒంపి  నీళ్ళు వచ్చే వరకు ఆగి ఆ బోరు కొట్టడమా ?
-ఒకవేళ అందులో నీళ్ళు పోస్తే ఆ మాటలు నిజం కాక నీళ్ళు రాక పోతే ?
-ఈ ఆలోచనలెందుకు ఆ జగ్గులో ఉన్న నీళ్ళు తాగితే ఆ కొన్ని నీళ్ళు అప్పటికప్పుడు దాహం తీర్చుకోవడం తప్ప ఆ తరువాత మళ్ళీ దారివెతుకుతూ వెళ్లి ఇలాగే నీళ్ళు లేకుండా చస్తే  ?
ఈ ఆలోచనల్లో ఏ నిర్ణయం తీసుకోవాల్లో తెలియక ఊగిసలాడుతూనే .ఈ నీళ్ళు తాగి వెళిపోతే సరి కదా మధ్యలో ఎవరో ఒకరు దారి చెబుతారు అనుకున్నాడు .కాని ఎవరూ  ఎదురవక ఇలాంటి పరిస్థితే రేపు కూడా ఎదురయితే ఏంటి పరిస్థితి అనుకుని మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాడు .ఏదైతే అది జరుగుతుంది ఈ బోరు మీద రాసిన మాటలు నమ్ముతున్నాను అని ఆ జగ్గులోని నీళ్ళు ఆ బోరు పంపులో ఒంపి  మెళ్లిగా  ఆ పంపు కొట్టడం ప్రారంభించాడు .మొదటి అర్ధగంట వరకు కొడుతూనే ఉన్నాడు అయినా నీళ్ళు రాలేదు .భయం భయం, చచ్చిపోయే సమయం వచ్చినట్టే ఉంది ఐనా  ఆ కొన్ని నీళ్ళు తాగి వెళిపోతే బాగుండేది కదా నా పిచ్చి కాకపొతే అనుకుని  తనని తానూ తిట్టుకుంటున్నాడు . మళ్ళీ బోరు కొట్టడం ప్రారంబించాడు.కొద్ది సేపటికి నీళ్ళు రావడం మొదలయ్యాయి .అక్కడ రాసి ఉన్నట్టే సమృద్దిగా వచ్చాయి.  కావలసినన్నినీళ్ళు త్రాగాడు. బాటిల్ నింపుకున్నాడు.ఒళ్ళు కడుకున్నాడు. సంతోషం వేసింది ఆ మాటల్ని నమ్మినందుకు .సందేహం భయపెట్టినా కార్యాన్ని మధ్యలో వదిలి పెట్టనందుకు తనని తానూ అభినందించుకుని దేవునికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.ఆ జగ్గు మీద రాసున్న మాటలు "-మీరు ఆ బోరులో ఈ నీటిని పోసిన తరువాత ,వచ్చిన నీళ్ళు తాగి వెళ్ళేప్పుడు మళ్ళీ ఈ జగ్గు నింపి పెట్టండి అని." ఆ చుట్టు  పక్కన వెతికి దొరకిన సుద్ధ ముక్కతో ఆ బోరింగు మీద ఇప్పుడు ఈ వ్యక్తి  ఇలా రాసి బయలు దేరాడు -" ఇక్కడ రాసి ఉన్న మాటలను నమ్మండి , ఇది నిజం సందేహపడొద్దు ".

No comments:

Post a Comment